Fri Dec 27 2024 13:20:47 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడు మెజారిటీ ఈసారి...?
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఎన్నికల్లో గెలిచేందుకు మూడు పార్టీలూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఎవరు గెలిచినా మెజారిటీ పెద్దగా రాదన్న అంచనాలు అన్ని పార్టీలు నుంచి వినిపిస్తున్నాయి. ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతోనే గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.
నువ్వా? నేనా?
పోటీ నువ్వా? నేనా? అన్నట్లు సాగుతుంది. మూడు పార్టీలు ఒకదానికి ఒకటి తీసిపోవడం లేదు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఎన్నికల కమిషన్ కు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీ నుంచి మునుగోడులో కొందరి నేతల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయలు జమ అయినట్లు టీఆర్ఎస్ ఆధారాలు సేకరించింది. ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మరో వైపు కేంద్ర ఎన్నికల కమిషన్ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై ఆంక్షలు విధించింది. 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనడానికి వీలు లేదని పేర్కొంది.
టీఆర్ఎస్ ప్రచారం...
మరోవైపు నేడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ సభకు లక్షమంది జనసమీకరణ చేసేందుకు టీఆర్ఎస్ సమాయత్తమవుతుంది. బీజేపీ కూడా ఈ నెల 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభను రద్దు చేసుకున్నప్పటికీ మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, సభలు నిర్వహించాలని నిర్ణయించింది. బీజేపీ గ్రామాల్లో ఈరెండు రోజుల ఓటర్లను నేరుగా కలుసుకుని తమ వైపునకు తిప్పుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. పార్టీ అగ్రనేతలంతా మునుగోడుపైనే దృష్టి సారించారు. నేతలతో మునుగోడు గ్రామాలన్నీ కళకళ లాడుతున్నాయి. అక్కడే బస చేసిన నేతలు రాత్రి వ్యూహాలను రచిస్తున్నారు.
కాంగ్రెస్ చాపకింద నీరులా....
ఇక కాంగ్రెస్ చాపకింద నీరులాగా ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ ను కూడా ఈ ఎన్నికల్లో తీసి పారేయడానికి వీలులేని పరిస్థితిని తీసుకువచ్చింది. ముందుగానే అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్ ఒకరకంగా ముందడుగు వేసిందనే చెప్పాలి. సానుభూతి ఎక్కువగా పనిచేస్తుందని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతుంది. రెండు ప్రధాన పార్టీలు ఓట్లు చీల్చుకున్నా తాము సులువుగా అతి తక్కువ మెజారిటీతో బయపటపడతామని కాంగ్రెస్ విశ్విసిస్తుంది. మునుగోడు పై తొలుత ఆశలే లేని కాంగ్రెస్ క్రమంగా పుంజుకుని ఇప్పుడు రెండు పార్టీల అభ్యర్థులను భయపెట్టే స్థాయికి చేరిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మొత్తం మీద మూడు పార్టీలు మునుగోడులో తమ దళాలను మొహరించాయి. శక్తియుక్తులను ఒడ్డి విజయం కోసం పనిచేస్తున్నాయి. మరి చివరకు ఎవరిది విజయం అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Next Story