Mon Dec 23 2024 11:40:57 GMT+0000 (Coordinated Universal Time)
పాదయాత్రకు ముందే బాబు అలర్ట్
లోకేష్ పాదయాత్ర కంటే ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసే అవకాశముందని తెలిసింది
నారా లోకేష్ పాదయాత్ర మరో ఐదు రోజులలో ప్రారంభకానుంది. చిత్తూరు జిల్లాలో ప్రారంభమై తొలి నెల రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లోనే జరగనుంది. లోకేష్ పాదయాత్ర కంటే ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముందని తెలిసింది. టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ ఇచ్చిన సలహా మేరకు పాదయాత్ర పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలంటే అభ్యర్థులను ముందుగానే డిసైడ్ చేయడం మంచిదని భావించి ఆ దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు. కొందరు అభ్యర్థులను ఇప్పటికే చంద్రబాబు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అనధికారికంగా...
అయితే అధికారికంగా ప్రకటించలేదు కాని అనధికారికంగా కొందరిని వారి నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని సూచించారని చెబుతున్నారు. లోకేష్ పాదయాత్ర దాదాపు వంద నియోజకవర్గాల్లో పర్యటించనుంది. అక్కడ పాదయాత్ర సజావుగా సాగాలన్నా, పార్టీ క్యాడర్ లో జోష్ పెరగాలన్నా పాదయాత్రకు ముందే అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన గత కొద్ది రోజుల నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే 150 నియోజకవర్గాలకు పైగా సమీక్షలు పూర్తయ్యాయి.
ఇప్పటికే కొన్నింటిలో...
వాటిలో కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులకు చంద్రబాబు నుంచి టిక్కెట్ హామీ లభించిందని చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండటంతో కొన్ని చోట్ల మాత్రం వాటిని నిలిపేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జనసేన, కమ్యునిస్టుల పార్టీలతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ కలసి పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే వారు కోరుకునే నియోజకవర్గాలను ముందుగానే అంచనా వేసి వాటిని పక్కన పెట్టారంటున్నారు. లోకేష్ పర్యటించే వంద నియోజకవర్గాల్లో కొన్నింటిలో అవి కూడా ఉన్నప్పటికీ అక్కడ ఒకవేళ టిక్కెట్ రాకపోతే ఇన్ఛార్జిగా ఉన్న నేతకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న హామీ కూడా ఉందట.
పాదయాత్ర బాధ్యతను...
లోకేష్ పాదయాత్రకు ఖర్చు మాత్రమే కాకుండా జనసమీకరణను కూడా చేయాల్సి ఉన్నందున చంద్రబాబు కొందరికి టిక్కెట్లను ఇప్పటికే కన్ఫర్మ్ చేశారని చెబుతున్నారు. ఎటూ ప్రస్తుతం సిట్టింగ్ లో ఉన్న వారందరికీ టిక్కెట్లను చంద్రబాబు అధికారికంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో కొందరు పార్టీని వీడటంతో వారిని మినహాయించి మిగిన వారందరికీ టిక్కెట్లు వచ్చే ఎన్నికల్లో ఇచ్చే అవకాశముంది. కొన్ని చోట్ల నియోజకవర్గాలను మార్చే అవకాశం కూడా ఉంది. లోకేష్ పాదయాత్ర ఆ నియోజకవర్గాల్లో ప్రవేశించే నాటికి అభ్యర్థి ఖరారవ్వాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు. పాదయాత్ర సక్సెస్ అయ్యే బాధ్యతను కూడా వారిపైనే చంద్రబాబు పెట్టనున్నారని సమాచారం.
Next Story