Mon Dec 23 2024 12:52:59 GMT+0000 (Coordinated Universal Time)
మర్డర్ కేసు.. ముంచేదెవరిని?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. అయితే ఈ హత్య ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. అయితే ఈ హత్య ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. అధికార వైసీపీ నేతలే హత్యకు కారణమని టీడీపీ ఆరోపిస్తుంది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ హత్య కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. నిందితులను తన అన్న ముఖ్యమంత్రి జగన్ రక్షించే ప్రయత్నం చేస్తున్నారని సునీత ఆరోపిస్తున్నారు.
టీడీపీ రాజకీయంగా...
వైఎస్ కుటుంబంలో ఈ హత్యకు సంబంధించి తలెత్తిన వివాదాన్ని తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకుంటుంది. సీబీఐ అధికారులకు కూడా ప్రాణహాని ఉందని చెబుతుంది. సీబీఐ అధికారిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో టీడీపీ దీనిని రాజకీయంగా అనుకూలంంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను రాష్ట్రంలో ప్రవేశించకుండా చట్టాన్ని తీసుకు వచ్చారు.
వైసీపీ మాత్రం.....
ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ సీబీఐ విచారణను స్వాగతిస్తుంది. రాజకీయంగా లాభపడటానికి ప్రయత్నిస్తుంది. అధికార వైసీపీ కూడా ఈ హత్యతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెబుతోంది. అవినాష్ రెడ్డి వివేకాను హత్య చేయించేందుకు ఎందుకు కుట్ర పన్నుతారని ప్రశ్నిస్తుంది. వైఎస్ కుటుంబంలోని కొందరు వ్యక్తిగత విషయాలు బయటపడతాయానే తాము మౌనంగా ఉన్నామని చెబుతోంది.
వీరిపైనే అనుమానం....
ఈ కేసులో ప్రధానంగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలతో పాటు వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా వ్యక్తిగత జీవితంలో మరో కోణం ఉందని, ఆస్తులను కాపాడుకోవడం కోసమే అల్లుడు ఈ హత్య చేయించి ఉంటాడని వైసీపీ నేతలు చెబుతున్నారు. సీబీఐ ఆ దిశగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో వివేకా హత్య హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల ప్రచారంలో ఇది ప్రధాన ప్రచారాంశంగా మారనుంది. చివరకు ఎవరు ఈ కేసులో చిక్కుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story