Sun Dec 22 2024 19:04:42 GMT+0000 (Coordinated Universal Time)
రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్... ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో?
కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది
కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు మంజూరు చేయడంతో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య లభిస్తుంది. కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎనిమిది కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణలో ఏడు నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఒకే చెప్పింది.
ఏపీలో ఇక్కడ...
కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా అందులో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్‌లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
తెలంగాణలో ఎక్కడంటే?
తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలను జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయా విద్యాలయాలను ఏర్పాటు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలో కొత్తగా మంజూరయిన కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అలాగే తెలంగాణలోనూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి నవోదయ విద్యాలయాలు ప్రారంభమవుతాయి. దీని వల్ల పేద పిల్లలకు తక్కువ ధరకు నాణ్యతతో కూడిన విద్య లభిస్తుందని భావిస్తున్నారు. నిజంగా ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి విద్యాసంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో రెండు తెలుగు రాష్ట్రాల నాయకత్వాలు హ్యాపీ ఫీలవుతున్నాయి.
Next Story