Tue Dec 24 2024 13:04:54 GMT+0000 (Coordinated Universal Time)
సన్యాసం సవాళ్లు... అసలు సాధ్యమేనా?
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర నాధ్ రెడ్డి మధ్య ఛాలెంజ్ లు వినిపిస్తున్నాయి
రాజకీయ సన్యాసం అనే మాట కర్నూలోళ్లకు కొత్తగాదు. అందునా నంద్యాల, ఆళ్లగడ్డ నాయకులకు ఇది అలవాటయిన పదమే. మరోసారి రాజకీయ సన్యాసం అనే మాట ఇప్పుుడు మరోసారి విన్పిస్తుంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాధ్ రెడ్డిల మధ్య సన్యాసం మాట విన్పించడం విశేషమనే చెప్పాలి. ఇద్దరిదీ మూడు పదుల వయసే. రాజకీయాల్లోకి వచ్చింది కూడా నిన్న గాక మొన్ననే. అయినా సరే ... రాజకీయ సన్యాసం చేస్తామంటూ తొడగొడుతుండటం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది.
ఉప ఎన్నిక సమయంలోనూ....
గతంలో నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ భూమా అఖిలప్రియ, అప్పటి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిల మధ్య ఇలాంటి సంభాషణే జరిగింది. ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనని, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో ఓటమి పాలయితే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని శిల్పా మోహన్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. అయితే ఆ ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
శిల్పా మోహన్ రెడ్డి.....
మరి మాట నిలబడారనుకోవాలి. ఆయన ఇప్పటి వరకూ రాజకీయంగా లేనట్లేనని చెప్పాలి. తన కుమారుడు శిల్పా రవిచంద్రారెడ్డిని 2019 ఎన్నికల్లో పోటీకి దింపి గెలిపించుకున్నారు. శ్రీశైలం నుంచి ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. తన కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలున్నా ఆయన మాత్రం రాజకీయంగా దూరం పాటిస్తున్నారు. అప్పుడు ఆ సవాల్ ఫలితమేనంటున్నారు శిల్పా అభిమానులు. అయితే శిల్పా మోహన్ రెడ్డి రాజకీయంగా అన్నీ చూశారు. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన ఆయనకు జరిగే నష్టం పెద్దగా లేదు.
నేడు ఆళ్లగడ్డలో....
కానీ ఇప్పుడు సన్యాసం సవాళ్లు విసురుకుంటున్న ఇద్దరు నేతలు మొన్ననే రాజకీయాల్లోకి వచ్చారు. ఇంకా ఓనమాలు కూడా దిద్దలేదు. గంగుల బిజేంద్ర నాధ్ రెడ్డి తొలిసారి ఆళ్లగడ్డ నుంచి 2019 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భూమా అఖిలప్రియ 2014 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై మంత్రి పదవిని చేపట్టారు. అలాంటి ఇద్దరూ ఇప్పుడు అవినీతిపై సవాళ్లు విసురుకుంటున్నారు. ఎమ్మెల్యే గంగుల అవినీతిని తాను నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అఖిలప్రియ సవాల్ విసిరారు. నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బిజేంద్ర నాధ్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?
Next Story