Sat Nov 23 2024 08:34:06 GMT+0000 (Coordinated Universal Time)
రుయా ఆస్పత్రి ఘటనపై చంద్రబాబు ఫైర్
ఆస్పత్రిలో అంబులెన్సులు ఉన్నా ఉపయోగం లేకుండా పోయాయన్న చంద్రబాబు.. ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ను కూడా అక్కడున్న..
తిరుపతిలో ఉన్న రుయా ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటనపై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందగా, అంబులెన్స్ సిబ్బంది రూ.10 వేలు డిమాండ్ చేయడంతో.. ఆ తండ్రి కొడుకు మృతదేహాన్ని బైక్ పై 90 కిమీ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు నాయుడు.. తిరుపతి రుయా ఆసుపత్రిలో బాలుడి మృతి పట్ల తన హృదయం క్షోభిస్తోందని పేర్కొన్నారు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చాలని ఆ బాలుడి తండ్రి అధికార వర్గాలను వేడుకున్నా ఫలితం లేకపోయిందని వాపోయారు.
ఆస్పత్రిలో అంబులెన్సులు ఉన్నా ఉపయోగం లేకుండా పోయాయన్న చంద్రబాబు.. ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ను కూడా అక్కడున్న అంబులెన్స్ మాఫియా వెనక్కి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు డిమాండ్ చేసిన రూ.10 వేల ఖర్చును ఆ తండ్రి భరించలేక, వేరే గత్యంతరం లేక బాలుడి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన చెందారు. హృదయాలను మెలితిప్పే ఈ విషాదం రాష్ట్ర ఆరోగ్య రంగ దుస్థితికి నిదర్శనం అని చంద్రబాబు తెలిపారు. జగన్ పాలనలో ప్రతిదీ లోపభూయిష్టమేనని విమర్శించారు.
Next Story