తెలంగాణకు నేనెందుకు వస్తాను....? జై తెలంగాణ
తాను ఎక్కడ ఉన్నా తెలంగాణ తనకు ప్రియ ప్రాంతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తాను ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటూనే తెలంగాణకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. అంతే తప్ప తాను తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తానని ప్రశ్నించారు. బుధవారం ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి బహిరంగ సభలో ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
- కింద ఉన్న రాష్ట్రం ప్రాజెక్టులకు అడ్డుపడుతుందంటే ఎంతవరకు సబబు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం అన్నివిధాలుగా సహకరిస్తాను. తెలంగాణ అభివృద్ధికి నేనెప్పుడూ అడ్డుపడలేదు.
- నేను హైదరాబాద్ నగరాన్ని కట్టలేదు. సైబరాబాద్ ను నా హయాంలోనే రూపకల్పన చేశాం.
- కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదు. నన్ను దూషించడం న్యాయమా ? నేను ఏం తప్పు చేశాను ? టీడీపీ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటాడా ? టీడీపీ కేసీఆర్ కి రాజకీయ జన్మనిస్తే నన్నే విమర్శిస్తారా ?
- టెక్నాలజీ తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా... తన పోరాటం వల్లే వీవీపాట్ వచ్చింది. ఓటు వేసినప్పుడు కచ్చితంగా ఎవరికి ఓటు వేశామో వీవీపాట్ లో చూడాలి.
- రాహుల్ గాంధీతో కలిసి టీడీపీ వేదిక పంచుకోవడం చారిత్రక అవసరమని, ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుంది.
- రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన సీబీఐ, ఈడీ, ఆర్బీఐ, గవర్నర్ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి.
- పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి ఆగిపోయింది.
- ముస్లిం సోదరుల పట్ల అసహనంతో వ్యవహరించి వారిలో అభద్రతాభావం తీసుకువచ్చారు.
- దేశంలో మీడియా కూడా రాయలేని పరిస్థితిని ఎదుర్కొంటుంది.
- ఎన్డీఏ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఉన్నందునే 37 ఏళ్లుగా పోరాడిన రెండు పార్టీలు దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం కలిశాం.
- విభజన సమన్యాయంతో జరపాలని చెప్పాను గానీ ఏకపక్షంగా జరపమని ఎప్పుడూ నేను చెప్పలేదు. సమైక్య రాష్ట్రంలో అందరూ రెండుగా విడిపోయినా తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని, ఇద్దరిని కలిపేలా ముందుకుపోయాను.
- తెలంగాణ, ఏపీకి విభజన హామీలు అమలు చేయడం లేదు. అయినా టీఆర్ఎస్ పార్టీ అడగడం లేదు.
- తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నయి. హైదరాబాద్ బంగారు గుడ్డు పెట్టే నగరం. భూమి, వాతావరణం కూడా తెలంగాణకు అవకాశంగా ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకుంటే భారత్ లో నెం 1 రాష్ట్రంగా తెలంగా ఉంటుంది.
- తెలంగాణలో నాలుగేన్నరేళ్లుగా పాలన చూస్తుంటే బాధేస్తుంది. అప్పులు పెరిగిపోయాయి. అభివృద్ధి ఆగిపోయింది.
-కేసీఆర్ కి, ఎంఐఎంకి ఓటేస్తే పరోక్షంగా నరేంద్ర మోదీకి ఓటేసినట్లే.
-తెలుగుదేశం, కాంగ్రెస్, తెలంగాణ జనసేన, సీపీఐ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలి. జై తెలంగాణ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నినదించారు.