Mon Dec 23 2024 11:18:46 GMT+0000 (Coordinated Universal Time)
భువనేశ్వరిని బజారుకీడుస్తుంది ఎవరు?
చంద్రబాబు ఆవేదనను తప్పుపట్టడం లేదు. అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యవహారశైలిని సమర్థించడమూ లేదు.
చంద్రబాబు ఆవేదనను తప్పుపట్టడం లేదు. అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యవహారశైలిని సమర్థించడమూ లేదు. కానీ జరిగిన విషయాన్ని ఒక కోణంలోనే చూడటం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకే చెల్లింది. జర్నలిస్టు గా రెండు కోణాల్లో రాయాల్సిన వీకెండ్ కామెంట్ వన్ సైడ్ గానే ఉంది. అసలు రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ చూస్తే సభలో ఎంత అరాచకం జరిగిందో అని ప్రజలు అనుకోవాలనే రాసినట్లుంది. చంద్రబాబు సీనియర్ నేత. ఆయన ఏడుపు విషయంలోనూ ఎవరికీ అభ్యంతరం లేదు.
మూడు నిమిషాల ఎపిసోడ్ ను...
కానీ సభలో దుశ్వాసన పర్వమట. కురుక్షేత్ర సభ లాగుందట. వైసీపీ ఆంబోతులట. సంస్కార హీనులు రాజ్యమేలుతున్నారట. సోషల్ మీడియాలో ఉన్మాదం చూసి విస్తుపోయారట. ఏడ్వాల్సింది చంద్రబాబు కాదట. ప్రజలేనట. ఏపీ అసెంబ్లీలో ఇదేమీ కొత్త విషయం కాదు. భువనేశ్వరి పేరునే తాము ప్రస్తావించడం లేదంటున్నా ఆమెను వీధుల్లోకి లాగే ప్రయత్నం చేస్తుంది ఎవరు? మూడు నిమిషాల అసెంబ్లీలో జరిగిన విషయాన్ని మూడు రోజుల నుంచి సాగదీయడమే అనుకూల మీడియా పనిగా పెట్టుకుంది. అసలు మాధవరెడ్డి పేరు ఎత్తితే ఎందుకు అంత ఆగ్రహం అన్న అనుమానాలను రేకెత్తెంచేలలా ఆర్కే వ్యాసం కొనసాగింది.
నిజంగా ప్రేమ ఉంటే...
చివరకు లోకేష్ పుట్టుక ప్రస్తావనను కూడా ఆర్కే తేవడం సముచితం కాదు. దానిని ఎవరూ ఆకళింపు చేసుకోలేరు. సమర్థించరు కూడా. నిజంగా నారా కుటుంబం మీద ప్రేమ ఉంటే ఈ ఎపిసోడ్ కు అంతటితో ఫుల్ స్టాప్ పెట్టడం సన్నిహితులు చేసే పని. కానీ చంద్రబాబుకు సానుభూతిని మరింత తెచ్చే పెట్టే ప్రయత్నంలోనే ఆర్కే ఉన్నారని పిస్తుంది. రాధాకృష్ణ గత అసెంబ్లీలో జరిగిన విషయాలను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది. ఇక చంద్రబాబుకు వచ్చేవే చివరి ఎన్నికలట. ఆయనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదట. ప్రజలకే ఆయన అవసరం ఉంటే గెలిపించుకోవాలట.
నాడు కనపడలేదా?
బోండా ఉమ, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడులు అధికారంలో ఉండగా క్లిప్పింగ్ లు చూడలేదా? గుర్తు లేదా? రోజాపై అన్న మాటలు నీ కలానికి కనపడలేదా? వినపడలేదా? రాజకీయంగా చంద్రబాబుకు మరింత బలం సమకూర్చాలంటే వైసీపీ ప్రభుత్వంలో అవినీతిని బయట పెట్టాలి. జగన్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రస్తావించాలి. అంతే తప్ప ఇంట్లో ఉన్న భువనేశ్వరిని బయటకు లాగుతుంది ఇప్పుడు ఎవరు? మీరు కాదా?
ఎన్టీఆర్ కుటుంబం ఇప్పడు గుర్తొచ్చిందా?
ఎన్టీఆర్ కుటుంబం అంటూ ఇప్పుడు నిక్కీ నీలుగుతున్న రాధాకృష్ణ ఆరోజు ఆయనను కూలదోసేందుకు చంద్రబాబుకు సహకరించలేదా? ఆరోజు ఆయనకు ఎన్టీఆర్ కుటుంబం కనపడలేదా? ఎన్టీఆర్ కుటుంబం అంటే చంద్రబాబు, భువనేశ్వరి మాత్రమేనా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంద్రేశ్వరి కాదా? ఆరోజు దగ్గుబాటిని వాడుకుని తర్వాత వదిలేస్తే ఈయనకు ఆ కుటుంబంపై ప్రేమ ఎక్కడకు వెళ్లింది? భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని వైసీపీ నేతలు చెబుతున్నా రాధాకృష్ణ మాత్రం ఒప్పుకోకుండా ఈ మెలో డ్రామాను మరికొంత కాలం కొనసాగించాలనే నిర్ణయించుకున్నట్లుంది. మొత్తంగా వైసీపీ సంగతి ఏమో కాని టీడీపీ దాని అనుకూల మీడియా కారణంగానే భువనేశ్వరి బజారు కెక్కుతున్నారు. ఈ విషయాన్ని నందమూరి కుటుంబం గమనిస్తే మంచిది.
Next Story