Mon Dec 23 2024 10:02:17 GMT+0000 (Coordinated Universal Time)
రాబిన్ శర్మ సక్సెస్ రేటెంత? టీడీపీ నేతలేమంటున్నారు?
చంద్రబాబు రాబిన్ శర్మను వ్యూహకర్తగా నియమించుకున్నారు.సర్వేతో పాటు మ్యానిఫేస్టో రూపకల్పనతో శర్మ టీం బీజీగా ఉంది.
తెలుగుదేశం పార్టీకి ఈసారి గెలుపు అవసరం అంతా ఇంతా కాదు. ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాల్సిన ఎన్నికలు 2024వి. అందుకే నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సయితం వ్యూహకర్తను నియమించుకున్నారు. నిజానికి ఇప్పటి వరకూ చంద్రబాబుకు వ్యూహకర్తతో ఎలాంటి పని లేకుండా పోయింది. ఆయన వ్యూహాలతోనే ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. కానీ కాలం మారింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎటూ చంద్రబాబుకు మద్దతు ఉంది. సోషల్ మీడియాలో మాత్రం వెనకబడినట్లు గుర్తించిన చంద్రబాబు దానిని అధిగమించేందుకు రాబిన్ శర్మను వ్యూహకర్తగా నియమించుకున్నారు. అభ్యర్థుల సర్వేతో పాటు మ్యానిఫేస్టో రూపకల్పనతో రాబిన్ శర్మ టీం బీజీగా ఉంది.
పీకే టీంలో...
రాబిన్ శర్మ ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో ఉండేవారు. ఆయన టీం నుంచి బయటకు వచ్చిన రాబిన్ శర్మపై చంద్రబాబు అపార నమ్మకం పెట్టుకున్నారు. పార్టీకి నిర్దేశించిన కార్యక్రమాలను కూడా రాబిన్ శర్మ టీం రూపొందించినవే. బాదుడే బాదుడు, మినీ మహానాడులు తాజాగా రాష్ట్రానికి ఇదేం ఖర్మ వంటి కార్యక్రమాలు రాబిన్ శర్మ టీం నుంచి వచ్చినవే. ఈ కార్యక్రమాల్లో పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నెలకొంటం, కీలకమైన ప్రాంతాల్లో సక్సెస్ కావడంతో చంద్రబాబు రాబిన్ శర్మపై మరింత ఆశలు పెట్టుకున్నారు. అందుకే చంద్రబాబు నేరుగా రాబిన్ శర్మను సమావేశంలో నేతలకు పరిచయం చేశారు.
నేరుగా పరిచయం చేసి...
ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాబిన్ శర్మను నేతలకు పరిచయం చేసిన చంద్రబాబు రాబిన్ శర్మకు సహకరించాలని కోరారు. మరో విశేషం ఏంటంటే.. రాబిన్ శర్మ టీం ఇచ్చిన నివేదికలో పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం లేదని నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా బూత్ ఇన్ ఛార్జిల నియమాకంలో నేతలు సక్రమంగా వ్యవహరించలేదని తేల్చారు. దాదాపు 80 శాతం బూత్ ఇన్ ఛార్జి పదవులు ఖాళీగా ఉన్నాయని రాబిన్ శర్మ ఇచ్చిన నివేదికలో తేలడంతో చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. ఇలాగైతే ఎన్నికలకు ఎలా వెళతారని ఆయన నేతలను ఘాటుగానే ప్రశ్నించినట్లు తెలిసింది.
తమకు భారంగా మారాయని...
రాబిన్ శర్మ వ్యూహాలన్నీ పెద్దగా పనిచేయడం లేదన్నది నేతల భావన. అందుకే ఆయనను నేతలు లైట్ గా తీసుకున్నారంటున్నారు. పొత్తులతో కలసి వెళదామని చంద్రబాబుకు రాబిన్ శర్మ నూరిపోస్తున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేసిన వారు కూడా లేకపోలేదు. అలాగే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కూడా ఎక్కువ నియోజకవర్గాల్లో చేయలేదని నివేదిక ఇచ్చారు. దీనిపై కూడా చంద్రబాబు నేతలపై సీరియస్ అయ్యారని తెలిసింది. రాబిన్ శర్మ వ్యూహాలు సక్రమంగా పనిచేయడం లేదని, తమకు భారమైన కార్యక్రమాలను రూపొందిస్తున్నారని నేతలు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా జగన్ ఇతర మార్గాల్లో ఇరుకున పెట్టే విధంగా వ్యూహకర్త చేయాలి కాని, అసలే అప్పులతో ఉన్న తమపై మరింత భారాన్ని రాబిన్ శర్మ మోపుతున్నారన్నది ఎక్కువ మంది నేతల ఫీలింగ్. చంద్రబాబు మాత్రం రాబిన్ శర్మ చెప్పినట్లే నడుచుకోవాలని నేతలను ఆదేశిస్తున్నారు. భవిష్యత్ లో రాబిన్ శర్మ టీం సర్వే ప్రకారమే టిక్కెట్లు కేటాయిస్తామని చెబుతున్నప్పటికీ నేతలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదన్నది పార్టీలో వినిపిస్తున్న కామెంట్స్. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story