Wed Nov 20 2024 10:28:58 GMT+0000 (Coordinated Universal Time)
బాబు మాట తప్పడం గ్యారంటీయా?
చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో నేతలున్నారు. కొందరు పార్టీని వీడివెళ్లిపోయినా మరొకరికి అవకాశం ఇచ్చేంత బలమైన నేతలున్నారు.
చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడతారా? వలస పక్షులకు అవకాశం ఇవ్వరా? కీలక నేతలు చివరి నిమిషంలో వస్తే చంద్రబాబు పార్టీలో చేర్చుకోరా? అంటే కొందరు ఊ... అని మరి కొందరు ఉహూ అని అంటుండటం విశేషం. చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో నేతలున్నారు. కొందరు పార్టీని వీడివెళ్లిపోయినా అక్కడ మరొకరికి అవకాశం ఇచ్చేంత బలమైన నేతలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు.
చివరి నిమిషంలోనే ఎప్పుడైనా...?
కానీ ఎప్పుడైనా రాజకీయాల్లో చివరి నిమిషంలోనే చేరికలు, వలసలు ఉంటాయి. ఎన్నికల సమయంలో టిక్కెట్ దక్కక కొందరు, పార్టీలో ఇమడలేక మరికొందరు పార్టీలు మారుతుంటారు. వారికి వ్యక్తిగత బలం ఉంటుంది. నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిగత క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్న నేతలు అనేక మంది ఉన్నారు. ఉదాహరణకు ధర్మవరంలో వరదాపురం సూరి, జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి వారు ఉన్నారు.
ఆర్థికంగా బలమైన...
వీరు కేవలం ఓట్లు మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా బలమైన నేతలు. ఒకవేళ వారు వస్తానంటే చంద్రబాబు కాదంటారా? వలస పక్షులకు ఇక పార్టీలో చేరే అవకాశం లేదని చెప్పిన చంద్రబాబు మాట మీద నిలబడతారా? అన్న చర్చ జరుగుతుంది. అయితే ఎన్నికల్లో గెలవాలంటే మడి కట్టుకుని కూర్చుంటే సరిపోదు. 2019 ఎన్నికల సమయంలోనూ అనేకమంది టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోయారు. వారివల్ల పార్టీ గెలవకపోయినా చేరికల వల్ల ఎన్నికల సమయంలో పార్టీకి హైప్ వచ్చింది.
కామెంట్స్ వెనక...
మరి గతంలో తాను అధికారంలో ఉన్నప్పడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు. వారిలో చాలా మందికి టిక్కెట్లను చంద్రబాబు ఇవ్వలేదు. ఇచ్చిన వారిలో ఒక్క గొట్టిపాటి రవికుమార్ మాత్రమే గెలిచారు. అయితే చంద్రబాబు చేసిన స్టేట్ మెంట్ పార్టీ కార్యాలయం గడప దాటదు. ఎన్నికల సమయంలో చేరికలు మామూలే. బలమైన చోట వారికి టిక్కెట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే గెలుపు సాధ్యమవుతుంది. మరి చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల వెనక మరో ఉద్దేశ్యం కూడా లేకపోలేదు. కష్టపడిన వారికే గుర్తింపు అన్నారంటే వారికే టిక్కెట్ అనుకుని ఈ మూడేళ్లు చొక్కాలు చించుకుని సైకిల్ ను పరుగులు తీయిస్తారని కావచ్చు. చూడాలి చంద్రబాబు స్టేట్ మెంట్ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో?
- Tags
- chandra babu
- tdp
Next Story