Fri Dec 20 2024 12:35:46 GMT+0000 (Coordinated Universal Time)
కొడాలికి కళ్లెం వేసేది ఇలాగేనా?
చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు గుడివాడలో మినీ మహానాడు ఏర్పాటు చేయడం కూడా స్ట్రాటజీలో భాగమే.
వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు అంత సులువు కాదు. ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయరు. ఈసారి గెలుపు ఆయనకు అత్యవసరం. అందుకే చంద్రబాబు ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు గుడివాడలో మినీ మహానాడు ఏర్పాటు చేయడం కూడా స్ట్రాటజీలో భాగమే. ప్రధానంగా గుడివాడలో కొడాలి నాని కొరకరాని కొయ్యలా మారారు. దశాబ్దకాలం నుంచి నుంచి అక్కడ టీడీపీకి గెలుపు లేదు. కొడాలి నాని రెండు సార్లు టీడీపీ నుంచి, రెండు సార్లు వైసీపీ నుంచి విజయం సాధించారు.
మినీ మహానాడుతో...
దీంతో అక్కడ మినీ మహానాడును ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అంతేకాదు నిమ్మకూరులోనూ చంద్రబాబు రాత్రి బస చేసే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబం అండగా ఉంటూ వస్తున్నా గుడివాడ మాత్రం దరిచేరడం లేదు. అక్కడ సరైన నేత లేకపోవడమే కారణం. ప్రతి సారి అభ్యర్థులను మారుస్తుండటమే ఇందుకు కారణం. ఒకరినొకరు సహకరించుకోరు. దీంతో గుడివాడ చేజారి పోతుంది.
అభ్యర్థులను మార్చడం....
2014 ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన ఓటమిపాలు కావడంతో 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ ను పోటీకి దింపారు. ఫలితం లేదు. ఈసారి కూడా అభ్యర్థిని మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. రావి వెంకటేశ్వరరావు పూర్తి స్థాయిలో క్యాడర్ కు అందుబాటులో లేకపోవడంతో కొత్త వ్యక్తికి బాధ్యతలను అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. సామాజికవర్గాల పరంగా చూస్తే గుడివాడలో కమ్మ, కాపు, యాదవలతో పాటు ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
ఇతర వర్గాలకు...
ఈసారి కమ్మ సామాజికవర్గం కాకుండా ఇతర వర్గాలకు టిక్కెట్ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొడాలి నాని తమ కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుండటంతో అక్కడ మినీ మహానాడు పెట్టి క్యాడర్ లో ఉత్సాహం నెలకొల్పాలన్నది చంద్రబాబు యోచన. అయితే అక్కడ నాయకుల మధ్య సఖ్యత లేదు. ఇప్పటికే నలుగురు నాయకులు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందు మినీ మహానాడు కంటే అక్కడి నేతల్లో సఖ్యత తేగలిగితేనే కొడాలి నానికి చెక్ పెట్టే అవకాశాలున్నాయి. లేకుంటే ఐదోసారి నాని గెలుపును ఎవరూ ఆపలేరు.
Next Story