Mon Dec 23 2024 02:41:41 GMT+0000 (Coordinated Universal Time)
జేసీ వర్గానికి ఝలక్..?
టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితమైన గెలుపును ఆశిస్తున్నారు. అందుకే గెలిచే వాళ్లకే టిక్కెట్లు అని చెబుతున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితమైన గెలుపును ఆశిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలిచే నేతలకే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఏ నియోజకవర్గాన్ని ఆయన ఈసారి పోనీలే అని వదిలేసే పరిస్థితి కనిపించడం లేదు. అవసరమైతే ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తీసుకువచ్చి పోటీకి దింపాలని భావిస్తున్నారు. ప్రధానంగా రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. పట్టున్న అనంతపురం జిల్లాలోనూ గత ఎన్నికల్లో కేవలం రెండు స్థానాల్లోనే టీడీపీ విజయం సాధించింది. అందుకే ప్రతి నియోజకవర్గంలో దఫాలుగా సర్వేలు చేసిన తర్వాతనే టిక్కెట్లు కేటాయించనున్నారు.
శింగనమల నియోజకవర్గంలో...
శింగనమల నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అయితే అక్కడ పార్టీలో గ్రూపుల గోల హైకమాండ్ ను ఇబ్బంది పెడుతుంది. అక్కడ పార్టీ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా కమిటీని వేయాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో జేసీ వర్గానికి చెందిన బండారు శ్రావణిని పోటీకి దింపారు. అయితే ఆమె వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓటమి పాలయ్యారు. బండారు శ్రావణి జేసీ బ్రదర్స్ అనుచరురాలు. అందుకే గత ఎన్నికల్లో టిక్కెట్ లభించింది. అయితే ఈసారి ఆమెకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు. వైసీపీ నుంచి తిరిగి జొన్నలగడ్డ పద్మావతికే టిక్కెట్ దాదాపు ఖరారయిదంటున్నారు. జొన్నలగడ్డ పద్మావతి జగన్ చేయించిన సర్వేల్లో టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో ఒకరుగా నిలిచారు. ఈసారి కూడా జొన్నలగడ్డ పద్మావతిని బండారు శ్రావణి ఎదుర్కొనే అవకాశం లేదన్నది చంద్రబాబుకు అందుతున్న నివేదికలద్వారా తెలుస్తోంది.
సాకేను తీసుకు వచ్చి...
అందుకే కాంగ్రెస్ పీసీసీీ అధ్యక్షుడుగా పనిచేసిన సాకే శైలజానాథ్ ను పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.రాష్ట్రం విడిపోయి పదేళ్లు కావస్తుంది. ఇప్పటికీ కొన్ని పార్టీలు కోలుకోలేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో కనుచూపు మేరలో ఎటువంటి పురోగతి కన్పించడం లేదు. రాష్ట్రం ఇచ్చిన తెలంగాణలోనే ఆ పార్టీ అవస్థలు పడుతుండగా, ఏపీలో ఆ పార్టీ కోలుకోవడం కష్టంగానే చెప్పుకోవాలి. అందునా ఇటీవల గిడుగు రుద్రరాజును పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. దీంతో ఉన్న కొద్ది మంది నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. అందులో భాగంగా సాకే శైలజానాధ్ అయితే ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకంతో చంద్రబాబు కూడా ఉన్నారు. ఆయనయితే గెలిచే అవకాశాలున్నాయని సర్వేల్లో కూడా తేలింది.
అందరి వాడిగా....
ఇప్పటికే పదేళ్ల పాటు పాలిటిక్స్ ను పణంగా పెట్టారు సాకే శైలజానాధ్. అయినా కనుచూపు మేరలో గ్రోత్ లేదు. ఇక భవిష్యత్ ఉంటుందన్న నమ్మకమూ లేదు. అందుకే శైలజానాధ్ కూడా టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జేసీ వర్గానికి కొంత ఇబ్బంది తప్పదు. శైలజానాధ్ అందరినీ కలుపుకుని వెళ్లే నేత అయినా బండారు శ్రావణిని పక్కన పెడితే జేసీ వర్గానికి కొంత ఇబ్బంది పెట్టినట్లే. శైలజానాథ్ కూడా జేసీకి అనుకూలుడైన నేత కావడంతో చంద్రబాబు ఆయనను ఎంపిక చేశారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మరి జేసీ వర్గాన్ని మరో ఆప్షన్ లేదు. టీడీపీలోనే కొనసాగాల్సిన పరిస్థితి. ముందు తమ నియోజకవర్గాల్లో బలపడేందుకు వారు ప్రయత్నించాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు శైలజనాథ్ ను తీసుకు వచ్చి జేసీ వర్గానికి చెందిన బండారు శ్రావణికి చెక్ పెట్టాలన్న యోచనలో ఉన్నారు.
Next Story