Mon Dec 23 2024 13:17:25 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ సరే.. "పీస్" లేకుండా ఏంటిది?
చంద్రబాబు తాను చేస్తున్న తప్పుల గురించి తెలుసుకోవడం లేదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కూడా పనిచేయడం లేదు.
వైసీపీ ప్రభుత్వంపై జనంలో అసంతృప్తి ఉందంటున్నారు. జనం తిరగబడుతున్నారంటున్నారు. శ్రీలంకలా ఏపీ మారుతుందంటున్నారు. తిరగబడాలని జనాన్ని రెచ్చగొడుతున్నారు. కానీ తీరా చూస్తే పార్టీలోనే తిరుగుబాటు కనిపిస్తుంది. సరే.. నిజంగానే వైసీపీ పై అసంతృప్తి ఉంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు దానికి సమాధానమిస్తారు. ఇంతకూ మన పార్టీ సంగతేంటి? అన్నది టీడీపీ నేతల నుంచి వస్తున్న ప్రశ్న. నిజానికి టీడీపీ పట్ల ప్రజల్లో అంత సానుకూలత పెరిగితే పార్టీ నేతల్లో అంత అసహనం ఎందుకు కనిపిస్తుంది. సొంత పార్టీ నేతలే టీడీపీని విమర్శిస్తుంటే చంద్రబాబు నిస్సహాయంగా చూడటం తప్ప మరేమీ చేయలేకపోతుండటం విశేషం.
చేరికలు లేవు...
ఇంకా రెండేళ్లు మాత్రమే ఎన్నికలకు సయమం ఉంది. ఇప్పటికే చేరికలు ఉండాలి. ఇతర పార్టీల నుంచి నేతలు క్యూకట్టాలి. అధికార పార్టీపై అసంతృప్తి ఉంటే చంద్రబాబు కండువాలు కప్పుతూ క్షణం తీరిక లేకుండా ఉండాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. కండువాలు కప్పడమోమో కాని, పార్టీ నేతల నుంచే వస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇచ్చుకోలేని పరిస్థితి. చేరికలు పెద్దగా లేకపోవడానికి అనేక కారణాలున్నాయని చెప్పాలి. ఇందుకు చంద్రబాబు స్వయంకృతాపరాధమూ లేకపోలేదు. మహానాడు సక్సెస్ అయిందని, తన సభలకు జనం రావడం చూసి గెలుపు గ్యారంటీ అన్న ధీమాకు చంద్రబాబు వచ్చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని ఆయన ఎదురు చూస్తున్నారు.
తిరుగుబాటు....
కానీ చంద్రబాబు తాను చేస్తున్న తప్పుల గురించి తెలుసుకోవడం లేదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కూడా పనిచేయడం లేదు. ఎంపిక చేసుకున్న కొందరి నేతలనే నమ్ముకున్నారు. వారిచ్చిన రిపోర్టులనే నమ్ముకుంటున్నారు. 40 శాతం యువతకే ఈసారి టిక్కెట్లు అని ముందుగానే ప్రకటించడం, మూడేళ్ల పాటు పార్టీకి దూరంగా ఉన్నవారికి టిక్కెట్లు ఇచ్చేది లేదని చెప్పడం వంటివి నేతల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. పాత నేతలు ఎవరూ పెద్దగా యాక్టివ్ గా లేకపోగా, కొత్త గా వచ్చిన నేతల వెంట క్యాడర్ పరుగులు తీయడం లేదు. దీనికి తోడు కేశినేని నాని వంటి వాళ్లు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేదు. పొత్తులు ఉంటే గెలుస్తామన్న ధీమాలో నేతలు ఉన్నారు.
రెండు గ్రూపులు...
ఎన్నికలు సమయం దగ్గరపడే కొద్దీ మరింత మంది కేశినేనిలు పార్టీ నుంచి బయటకు వస్తారంటున్నారు. ఇందుకు కారణలు కూడా లేకపోలేదు. కొందరిని చంద్రబాబు దగ్గరికి తీస్తుంటే, మరికొందరిని లోకేష్ అక్కున చేర్చుకుంటున్నారు. దీంతో నియోజకవర్గాల్లో నేతల మధ్య గ్యాప్ పెరుగుతోంది. టిక్కెట్ పై ఎవరికీ నమ్మకం లేకపోవడంతో వారిలో చురుకుదనం లోపించింది. వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి ప్రజల్లో ఉండొచ్చేమో కాని, పార్టీలో పెరుగుతున్న అసహనాన్ని మాత్రం చంద్రబాబు పట్టించుకోవడం లేదు. అందుకే ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీతో సమానంగా గ్రూపులు బయలుదేరాయి. సమయం గడిచే కొద్దీ ఇవి మరింత ముదరే అవకాశముందన్నది మాత్రం వాస్తవం. కేశినేని నాని వంటి నేతలు మరికొందరు సిద్ధమైతే పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజీ కాక మానదు. అందుకే చంద్రబాబు ముందు పార్టీపై దృష్టి సారించాలంటున్నారు.
Next Story