వాయిదాలకు వెళ్లకపోతే ఎలా..?
తెలంగాణలో ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ‘బాబ్లీ సందర్శణ కేసు’లో చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ కావడం రాజకీయంగా కుదిపి వేస్తోంది. నోటీసులు రావడాన్ని అందిపుచ్చుకున్న రెండు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీని ద్వారా తెలంగాణలో మరోసారి ‘తెలంగాణ ప్రయోజనాల కోసం టీడీపీ ఎంత కష్టపడిందో’ గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, బీజేపీ నేతలు మాత్రం ఈ నోటీసుల అంశాన్ని తిప్పికొడుతున్నారు. కోర్టులను గౌరవించకుండా, వాయిదాలకు హాజరుకాకపోవడం వల్లె నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందని, దీనికి బీజేపీతో ఎటువంటి సంబంధం లేదని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. సాధారణంగా ముద్దాయిలు 3 సార్లు వాయిదాలకు హాజరుకాకపోతే వారెంట్ వస్తుందని, అటువంటిది చంద్రబాబు 22 సార్లు హాజరుకాలేదని గుర్తుచేశారు.