చంద్రబాబుదే ఈ వీకెండ్..!
తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టించిన ‘చంద్రబాబు అరెస్ట్’ వ్యవహారం మరిన్ని సంచలనాలతో ముందుకు సాగుతోంది. ప్రత్యర్థులు ఎన్ని కేసులు పెట్టినా... వాటన్నింటినీ దాటుకుని వచ్చిన చంద్రబాబు 73 ఏళ్ల వయసులో తన కంటే ఇరవై రెండేళ్లు చిన్నవాడైన జగన్మోహన్రెడ్డి చేతిలో ఎదురు దెబ్బలు తింటున్నారు. అవినీతి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడమే ఓ సంచలనమైతే... అతనికి 14 రోజుల రిమాండ్ విధించడం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అతి పెద్ద రాజకీయ సంఘటనగా చెప్పుకోవచ్చు
సీబీఐ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసిన తెదేపా లాయర్లు
గృహ నిర్బంధం, ఇంటి భోజనం, మందులు అనుమతించాలని వినతి
తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టించిన ‘చంద్రబాబు అరెస్ట్’ వ్యవహారం మరిన్ని సంచలనాలతో ముందుకు సాగుతోంది. ప్రత్యర్థులు ఎన్ని కేసులు పెట్టినా... వాటన్నింటినీ దాటుకుని వచ్చిన చంద్రబాబు 73 ఏళ్ల వయసులో తన కంటే ఇరవై రెండేళ్లు చిన్నవాడైన జగన్మోహన్రెడ్డి చేతిలో ఎదురు దెబ్బలు తింటున్నారు. అవినీతి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడమే ఓ సంచలనమైతే... అతనికి 14 రోజుల రిమాండ్ విధించడం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అతి పెద్ద రాజకీయ సంఘటనగా చెప్పుకోవచ్చు. శని, ఆదివారాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చంద్రబాబు అరెస్ట్ తప్ప మరో ఎంటర్టైన్మెంట్ లేదు. శనివారం ఉదయం ఆరు గంటలకు మొదలైన లైవ్ టెలికాస్ట్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టుకు తరలించిన దగ్గర్నుంచి... తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జనం వరల్డ్‌కప్ ఫైనలలో ఇండియా`పాకిస్తాన్ మ్యాచ్‌ను చూస్తున్నట్లు ఫీలయ్యారు. ఏ ఇద్దరు కలిసినా... ఒకటే చర్చ. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తారా? రిమాండ్‌ను తిరస్కరిస్తారా?
ఆదివారం ఉదయం ఇరు పక్షాల న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నప్పుడు పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. తీర్పు దాదాపు రెండు గంటలు రిజర్వ్ చేసినప్పుడు హై ఓల్జేజ్ వాతావరణం కనిపించింది. రెండు పార్టీలకు అనుకూల మీడియాలు ఉన్నాయి కాబట్టి.. ఆయా ఛానళ్లకు అతిధులుగా హాజరైన వ్యక్తులు... ఆయా పార్టీలకు అనుగుణంగా మాట్లాడారు. ఈ విధంగా తెలుగుదేశం అధినేత శని, ఆదివారాలు జనం నోళ్లలో నానారు.
ఏసీబీ న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పగానే, తెలుగుదేశం తరఫు న్యాయవాదులు సీబీఐ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రిని గృహనిర్బంధంలోనే ఉంచాలని, ఆయనకు ఇంటి భోజనం, మందులు ఇవ్వడానికి అనుమతించాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. తెలుగుదేశం అధినేతను రిమాండ్‌కు అనుమతించడంతో.. రాజమండ్రి జైలుకు తరలించడానికి పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఏసీబీ కోర్టు తీర్పుపై స్టే కోరుతూ సోమవారం ఉదయం తెలుగుదేశం తరఫు న్యాయవాదులు హైకోర్టులో లంచ్‌మోషన్ దాఖలు చేసే అవకాశముంది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం మరికొన్నాళ్ల పాటు తెలుగువాళ్ల అటెన్షన్‌ని డైవర్ట్ చేస్తూనే ఉంటుంది.
మరో వైపు రాష్ట్రమంతా 114వ సెక్షన్‌ను అమలు చేయాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబుకు రిమాండ్‌పై నిరసనగా తెలుగుదేశం కార్యకర్తలు రాష్ట్రమంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాలని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు సంఫీుభావంగా ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు బంద్‌లో పాల్గొనాలని ఆయన కోరారు.