Wed Jan 08 2025 06:33:48 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతిపై కుల ముద్ర వేస్తారా?
అమరావతి రాజధానిపై ఎందుకు జగన్ మాట తప్పారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.
అమరావతి రాజధానిపై ఎందుకు జగన్ మాట తప్పారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. అమరావతిపై కుల ముద్ర వేసి చంపేయాలని చూస్తున్నారన్నారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రాజధాని గా ఉండాలని అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు పవన్ కల్యాణ్ కూడా మద్దతిచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. రాజధానిని ఇష్టానుసారం మారుస్తానంటే కుదరదన్నారు. అమరావతి ప్రజారాజధాని అని అన్నారు.
రైతులు త్యాగానికి...
రైతులు త్యాగం 33 వేల ఎకరాలు త్యాగం చేసిన ఫలితమే అమరావతి రాజధాని అని చంద్రబాబు అన్నారు. ఏమనుకుంటున్నారు మీరు? అమరావతిని మూడు ముక్కలు చేస్తారా? అని ప్రశ్నించారు. రైతులు 45 రోజుల పాటు పాదయాత్ర చేస్తే అక్రమ కేసులు పెట్టారన్నారు. 500 మందిని జైల్లోకి తోశారన్నారు. ఎన్నికలకు ముందు జగన్ ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలన్నారు. అమరావతిని ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అమరావతి పై దుష్ప్రచారం చేశారన్నారు. అమరావతి మునిగిపోతుందన్నారు. మూడేళ్లలో ఎక్కడైనా మునిగిందా? అని నిలదీశారు. అమరావతిలో ఉన్న భూమి మరెక్కడా లేదని ఐఐఐటీ చెన్నై నిపుణులు చెప్పారన్నారు. హైదరాబాద్ లో సైబరాబాద్ ను నిర్మించి దానిని అభివృద్ధి చేశామని చంద్రబాబు చెప్పారు.
నడిబొడ్డున ఉందనే....
ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. మూడేళ్ల నుంచి ఎక్కడ జరిగిందో ఈ చేతకాని ప్రభుత్వం తేల్చలేకపోయిందన్నారు. రాజధాని అమరావతి రాష్ట్రానికి నడిబొడ్డున ఉందన్నారు. అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉందని అమరావతిని ఎంపిక చేస్తే దానిపై విమర్శలు చేస్తారా? అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. శాసనసభ, హైకోర్టు, సెక్రటేరియట్ రైతుల భూముల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. చేతకాక పోతే చేతకాదని చెప్పాలని, తాము అమరావతిని అభివృద్ధి చేసుకుంటామని చంద్రబాబు అన్నారు. అమరావతిని కాపాడుకుందామని, ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని ఆయన నినదించారు.
Next Story