Sun Dec 22 2024 18:37:19 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు ఇక "భువన" విజయమేనట
చంద్రబాబు స్ట్రాటజీలు అనేక రకాలుగా ఉంటాయి. ఈసారి ఎన్నికల్లో గెలవడం కోసం అన్ని ప్రయత్నాలు ఆయన చేస్తారు.
చంద్రబాబు స్ట్రాటజీలు అనేక రకాలుగా ఉంటాయి. ఈసారి ఎన్నికల్లో గెలవడం కోసం అన్ని ప్రయత్నాలు ఆయన చేస్తారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రధానంగా ప్రచారాన్ని చేయాల్సి ఉంటుంది. మరో రాష్ట్ర స్థాయి నేత లేరు. పొత్తులు కుదిరితే పవన్ కల్యాణ్ మరో ప్రచారకర్తగా మారతారు. అయినా తన పార్టీ పరంగా చూసుకుంటే క్యాంపెయిన్ లో వీక్ అని చంద్రబాబు అంతర్గత సమావేశాల్లో సయితం అంగీకరిస్తారు.
భువనేశ్వరిని....
లోకేష్ విషయానికొస్తే ఆయన అటు రాష్ట్ర స్థాయి నేత కాదు. ఇటు నియోజకవర్గం నేత కాదు. ఆయనకు పార్టీ క్యాడర్ తప్ప జనాన్ని ఆకర్షించే సత్తా లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో నారా భువనేశ్వరిని ప్రధాన ప్రచారకర్తగా వినియోగించుకోవాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యంగా కన్పిస్తుంది. భువనేశ్వరి మొన్న అసెంబ్లీలో జరిగిన ఘటనలో కావాల్సినంత సానుభూతిని సంపాదించుకున్నారు. ఆమె మహిళల్లో సానుకూలత ఉంది.
మూడు ప్రాంతాల్లో....
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎన్టీఆర్ కు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా భువనేశ్వరి ప్రజల్లోకి వెళితే పార్టీకి మంచి ఊపు వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమైన నియోజకవర్గాల్లో భువనేశ్వరి సభలను, రోడ్ షోలను ప్లాన్ చేసేందుకు చంద్రబాబు ప్రణాళిక రచిస్తున్నారు. భువనేశ్వరి నిన్న రాసిన లేఖతో కొంత జనంలోకి తొలుత పంపించ గలిగారు. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఎన్నికల్లోనూ భువనేశ్వరి ప్రచారం చేయలేదు.
ఎన్టీఆర్ కుమార్తెలను....
ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే ఆమె ఎన్నికల వేళ పర్యటించేవారు. భువనేశ్వరితో కలసి ఎన్టీఆర్ కుమార్తెలను కూడా ప్రచారంలోకి దించాలన్నది చంద్రబాబు యోచన. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలోకి రాకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదని, భువనేశ్వరి ఈసారి ప్రజల్లోకి వస్తారని ఆయన సీనియర్ నేతలతో అన్నట్లు తెలిసింది. మొత్తం మీద చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో భువనేశ్వరి ప్రచారాన్ని ఎక్కువగా నమ్ముకున్నట్లు కన్పిస్తుంది.
Next Story