మీతో పొత్తు మాకొద్దు, తేల్చి చెబుతున్న తండ్రీ కొడుకులు
తేల్చి చెబుతున్న తండ్రీ కొడుకులు చంద్రబాబు ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు తెలంగాణలో భారత రాష్ట్ర సమితితో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి మళ్లీ మొండి చెయ్యి ఎదురవుతోంది
తెలంగాణలో భారత రాష్ట్ర సమితితో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి మళ్లీ మొండి చెయ్యి ఎదురవుతోంది. అసెంబ్లీ వేదికగా భారాస కీలక నేతలు కేసీయార్, కేటీయార్‌లు చంద్రబాబును విమర్శిస్తూ, తెలుగుదేశంతో ఎలాంటి పొత్తూ పెట్టుకునే ఉద్దేశం లేదని పరోక్షంగా స్పష్టం చేశారు. తెలంగాణలో భారాసతో పొత్తు పెట్టుకోవాలనేది చంద్రబాబు ఇప్పటి కోరిక కాదు. 2018 ఎన్నికల ముందు కూడా ఆయన నాటి తెరాసతో సంధి ప్రయత్నాలు చేశారు. ఎన్టీరామారావు తనయుడు హరికృష్ణ మృతి సందర్భంగా, సంతాపం ప్రకటించడానికి వెళ్లిన కేటీయార్ వద్ద తెలంగాణలో తమ రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే బాగుంటుందని చంద్రబాబు ప్రతిపాదించినట్లు కేటీయారే స్వయంగా ప్రకటించారు.
ఈ ఆఫర్‌కి అప్పట్లో తెరాస సానుకూలంగా స్పందించలేదు. చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, తెలంగాణలో తెలుగుదేశం బలంగా ఉన్న చోట్ల ప్రచారం కూడా నిర్వహించారు. నాటి ఎన్నికల్లో తెరాస విజయం సాధించి, రెండో సారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తమ ఓటమికి చంద్రబాబు ప్రయత్నించిన విషయం కేసీయార్‌కి బాగా కోపం తెప్పించింది. చంద్రబాబుకి తాను ఖచ్చితంతా ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తానని, ఎనికల్లో గెలిచిన వెంటనే కేసీయార్ చెప్పారు. దానికి తగ్గట్లుగానే. 2019 ఎన్నికల్లో జగన్‌కు సాయం చేసి, చంద్రబాబు ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు.
ఇటీవల చంద్రబాబు మళ్లీ భారాసతో సంధికోసం తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ మధ్య జరిగిన సమావేశంలో కేసీయార్ పాలన చాలా బాగుందని పొగడ్తల వర్షం కురిపించారు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే తెలుగుదేశానికి పట్టు ఉన్న ప్రాంతాల్లో ఓట్లను భారాస వైపు మళ్లించవచ్చనేది చంద్రబాబు వ్యూహం కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన నేత కేసీయార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న ఆంధ్ర రాజకీయ నాయకులు కానీ, మీడియా సంస్థలు కానీ, సినిమా ప్రముఖులు కానీ కేసీయార్‌పై ఎలాంటి విమర్శలూ చేయరు. ఆయనతో మైత్రినే కోరుకుంటారు. చంద్రబాబు కూడా బహుశా అదే ఉద్దేశంలో కేసీయార్ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈ సంధి ప్రయత్నాలకు ఆదిలోనే కేసీయార్, కేటీయార్ సంధి కొట్టారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ‘హైదరాబాద్‌ని నేనే కట్టాను’ అంటున్న చంద్రబాబు మాటలను వ్యంగ్యంగా ఏకి పారేశారు కేటీయార్. ఓ పిచ్చోడి కథ చెప్పి సభను అలరించారు. కేసీయార్ కూడా తన ప్రసంగంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ అష్టకష్టాలు పడిందని ఆరోపించారు. ఇలా తండ్రీకొడుకులు ఇద్దరూ తెలుగుదేశంతో పొత్తుపట్ల తమకు ఆసక్తి లేదని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పారు.