Fri Dec 20 2024 05:40:37 GMT+0000 (Coordinated Universal Time)
చిలకలూరిపేటకు కొత్త క్యాండెట్
చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి నియోజకవర్గ అభ్యర్థి విషయంలో చంద్రబాబు కొత్త నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది
ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే టిడిపి అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచేశారు. చంద్రబాబు గతానికి భిన్నంగా అభ్యర్థుల విషయంలో ఇప్పటినుంచే క్లారిటీ ఇచ్చేస్తున్నారు. మామూలుగా చంద్రబాబు నామినేషన్లు పూర్తవుతున్నా చాలా నియోజకవర్గాలలో అభ్యర్థుల విషయాన్ని తేల్చకుండా నానుస్తూ వస్తూ ఉంటారు. ఇది గత ఎన్నికలలో చాలా నియోజకవర్గాలలో మైనస్ అయింది. దీంతో ఆ పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా ముందు నుంచే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.
బాబు కొత్త నిర్ణయం...
కీలకమైన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి నియోజకవర్గ అభ్యర్థి విషయంలో చంద్రబాబు కొత్త నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మ్యాటర్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ బాగా హైలైట్ అవుతుంది. చిలకలూరిపేట టిడిపి పేరు చెప్తే ముందుగా వినిపించే పేరు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు. 1999 నుంచి వరుసగా ఐదు సార్లు అక్కడ ఆయనే పోటీ చేస్తూ వస్తున్నారు. రెండుసార్లు ఓడిన పుల్లారావు.. మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్నా...
గత టిడిపి ప్రభుత్వంలో ఐదేళ్లపాటు మంత్రిగానూ ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్లలో ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడుగాను పని చేశారు. అయితే గత ఎన్నికలలో తన శిష్యురాలు విడదల రజనీ చేతిలో ఓడిపోవడం ఆయన రాజకీయ జీవితానికే ఘోర అవమానం. ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి పుల్లారావు మూడేళ్లకు పైగా నియోజకవర్గానికి పూర్తి దూరంగా ఉంటూ వచ్చారు. పుల్లారావు భార్య జోక్యంపై కూడా అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రిగా ఉన్న సమయంలో అనేకమంది వద్ద ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి. అసలు పార్టీ కేడర్‌ను కూడా పట్టించుకోలేదు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు కూడా లేవు.
మున్సిపల్ ఎన్నికలను కూడా...
ఇక మున్సిపల్ ఎన్నికలను కూడా పుల్లారావు ఏ మాత్రం సీరియస్ గా తీసుకోలేదు. నియోజకవర్గంలో వైసిపి పాలనలో ఎన్నో అరాచకాలు, అవినీతి జరుగుతుందని స్థానిక నేతలు గగ్గోలు పెట్టినా పుల్లారావు మాత్రం హైదరాబాద్ నుంచి రాలేదు. మనం స్థానిక ఎమ్మెల్యే పై పోరాటం చేయాలని నియోజకవర్గ స్థాయి నాయకులు పుల్లారావుకు ఫోన్లు చేసినా కూడా అటువైపు నుంచి స్పందన లేదు. చివరకు ఒకానొక దశలో పుల్లారావు రజనీతో మిలాఖత్ అయిపోయారన్న పుకార్లు కూడా నియోజకవర్గంలో వినిపించాయి.
భాష్యం ప్రవీణ్ పేరు...
అయితే ఇప్పుడు కొత్తగా భాష్యం ప్రవీణ్ పేరు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే నందమూరి ఆడపడుచు సుహాసిని పేరు వినిపిస్తున్నా... భాష్యం ప్రవీణ్ అక్కడ కార్యక్రమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రవీణ్ గత కొంత కాలంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ తరపున కార్యక్రమాలు స్పీడప్ చేస్తున్నారు. తాజాగా చిలకలూరిపేటలో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ భారీఎత్తున చేపట్టారు.
ప్రత్యేకంగా కార్యక్రమాలు...
అయితే పుల్లారావు పైకి ఫిర్యాదు చేయడంతో చంద్రబాబు సూచనల మేరకు అచ్చెన్న పుల్లారావు, ప్రణ్‌తో కాన్ఫన్స్ కాల్లో మాట్లాడినట్టు కూడా సమాచారం. ప్రవీణ్ మాత్రం తనకు ఎలాంటి దురుద్దేశం లేదని.. కేవలం పార్టీ తరపున జిల్లాలో చేస్తోన్న కార్యక్రమాల నేపథ్యంలోనే చిలకలూరిపేటలో కూడా ఈ రంజాన్ తోఫా కార్యక్రమం అమలు చేస్తున్నట్టు చెప్పాడట. అయితే పుల్లారావు ఈ సారికి కాకుండా మరోసారి కార్యక్రమం చేసుకోవాలని చెప్పగా.. ప్రవీణ్ ఇప్పటికే తాను భారీగా తోఫాలు రెడీ చేసుకున్నానని చెప్పడంతో పుల్లారావు మధ్యలోనే కాల్ కట్ చేసినట్టుగా కూడా తెలియవచ్చింది.
నరసరావుపేట లోక్ సభకు....
ఇక చంద్రబాబు కూడా ఆఫ్ ద రికార్డుగా పుల్లారావును ఉద్దేశించి ఈయన నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో కూర్చొన్నాడు.. ఇప్పుడు ప్రవీణ్ ఏదో కార్యక్రమం చేసుకుంటే దానికి ఇన్ని అడ్డంకులా అని అసహనం వ్యక్తం చేసినట్టు భోగట్టా ? ఏదేమైనా నియోజకవర్గంలో చాలా మంది యంగ్ కేడర్ అయితే భాష్యం ప్రవీణ్ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు. ప్రవీణ్ కొత్త ఫేస్ కావడంతో పాటు అందరికి అందుబాటులో ఉంటాడన్న పేరుంది. అందుకే చిలకలూరిపేట సీటు రేసులో భాష్యం ప్రవీణ్ పేరు గట్టిగా చర్చల్లోకి వస్తోంది. ఇక చంద్రబాబు కూడా పుల్లారావు సీనియార్టీకి తగినట్టుగా ఆయనను నరసారావుపేట లోక్‌సభ నుంచి బరిలోకి దింపి భాష్యం ప్రవీణ్‌ను చిలకలూరిపేట అసెంబ్లీ బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నట్టే కనపడుతోంది. మరి చివర్లో ఈ ఈక్వేషన్లు ఎలా ? మారతాయో ? అన్నది చూడాల్సి ఉంటుంది.
Next Story