Mon Dec 23 2024 16:51:09 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త జిల్లాలపై బాబు ఎందుకు పెదవి విప్పలేదంటే?
ఏపీ ప్రభుత్వం కొత్తగా 26 జిల్లాలకు నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో చంద్రబాబు మౌనంగా ఉండటం పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదు
కొత్త జిల్లాలపై చంద్రబాబు ఇప్పటి వరకూ స్పందించలేదు. ఏపీ ప్రభుత్వం కొత్తగా 26 జిల్లాలకు నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో చంద్రబాబు మౌనంగా ఉండటం పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై స్పందించే చంద్రబాబు జిల్లాల పెంపుపై మాట్లాడకపోవడంపై పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. ఆయన సీనియర్ నేతలు, స్థానిక నియోజకవర్గాల నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే పనిలో ఉన్నారని చెబుతున్నారు.
తాను అధికారంలో ఉన్నప్పుడు....
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిల్లాల సంఖ్యను పెంచాలని భావించారు. అయితే అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత భారం పడుతుందని చంద్రబాబు వెనక్కు తగ్గారు. జిల్లాల పెంపును పక్కన పెట్టారు. తెలంగాణలో జిల్లాల పెంపు ప్రతిపాదన వచ్చినప్పుడే జిల్లాల సంఖ్యను పెంచాలని భావించినా చంద్రబాబు ఆ పని చేయలేకపోయారు. ఆయన ప్రధానంగా అమరావతి, పోలవరంపైనే దృష్టి పెట్టారు.
పేర్ల మార్పుపై....
అయితే జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు జిల్లాల పెంపు ప్రతిపాదన తేవడంతో చంద్రబాబు దీనిపై స్పందించడానికి కొంత ఆలోచన చేస్తున్నారు. ఏ నియోజకవర్గాలకు అన్యాయం జరిగింది? పేర్ల ఖరారులో ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని చంద్రబాబు కొంత అథ్యయనం చేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టకుండా కృష్ణా జిల్లాకు పెట్టాలని, కోనసీమ జిల్లాకు బాలయోగి పేరు పెట్టడం వంటి వాటిపై ఆయన నేడో, రేపో స్పందించే అవకాశముందని చెబుతున్నారు. ఎలాంటి కసరత్తు లేకుండా హడావిడిగా జిల్లాలను ప్రకటించారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. 175 నియోజకవర్గాల నేతల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత చంద్రబాబు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది.
Next Story