విక్రమ్, రోవర్ స్లిప్ మోడ్‌లోకి ఎందుకు? ఎన్నో ఆసక్తికర విషయాలు
ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై దిగిన తర్వాత చంద్రయాన్-3 రోవర్ 'ప్రజ్ఞాన్' ల్యాండర్ 'విక్రమ్' నిరంతరం..
ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై దిగిన తర్వాత చంద్రయాన్-3 రోవర్ 'ప్రజ్ఞాన్' ల్యాండర్ 'విక్రమ్' నిరంతరం పని చేస్తూ చంద్రునికి సంబంధించిన రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ, ఇప్పుడు ప్రజ్ఞాన్, విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై తమ పనిని పూర్తి చేశాయి. ఇప్పుడు అది స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సమాచారం ఇస్తూ, చంద్రునిపైకి పంపిన చంద్రయాన్ -3 రోవర్, ల్యాండర్ సరిగ్గా పని చేస్తున్నాయని, అయితే ఇప్పుడు చంద్రునిపై రాత్రి అవుతున్న కారణంగా వాటిని స్లిప్ మోడ్‌లోకి తీసుకువచ్చామని ఇస్రో తెలిపింది.
ఇప్పుడు విక్రమ్, ప్రజ్ఞాన్‌ల సంగతేంటి?
ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటివరకు తన పనిని పూర్తి చేసిందని ఇస్రో తెలిపింది. ఇది ఇప్పుడు సురక్షితంగా 'పార్క్ చేశామని, అలాగే స్లీప్ మోడ్‌కు సెట్ చేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ల్యాండర్ విక్రమ్ శివశక్తి పాయింట్ వద్ద ఉంటుందని, ప్రజ్ఞాన్ దానికి 100 మీటర్ల దూరంలో ఉంది. ప్రజ్ఞాన్ రోవర్‌లోని APXS, LIBS 'పేలోడ్లు' రెండూ క్లోజ్ చేసినట్లు తెలిపారు. ఈ పేలోడ్ల నుండి డేటా ల్యాండర్ ద్వారా భూమికి చేరుతుందని తెలిపారు.
ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం రోవర్ బ్యాటరీలు పూర్తిగా ఛార్జింగ్ ఉంది. అయితే చంద్రునిపై చీకటి పడుతున్న నేపథ్యంలో వెలుతురు ఉంటేనే రోవర్ ఛార్జింగ్‌తో పరిశోధన కొనసాగిస్తుంది. ఇప్పుడు చంద్రునిపై వెలుతురు లేనికారణంగా సోలార్ సిస్టమ్‌లో ఛార్జ్ కాదు. అందుకే వాటిని స్లిప్మోడ్ లోకి తీసుకెళ్లారు. ఇక సెప్టెంబర్ 22, 2023న చంద్రునిపై తదుపరి సూర్యోదయం సమయంలో దాని సోలార్ ప్యానెల్లు మరోసారి యాక్టివ్‌గా మారవచ్చు. చంద్రయాన్ రిసీవర్‌ను పనిలో ఉంచుకున్నట్లు ఇస్రో తెలిపింది. రెండవ దశ పని కోసం ఇది విజయవంతంగా తిరిగి పని చేస్తుందని ఇస్రో భావిస్తోంది. సెప్టెంబర్ 22 తర్వాత విక్రమ్, ప్రజ్ఞాన్ యాక్టివ్‌గా మారకపోతే, రెండు కూడా భారతదేశ చంద్ర రాయబారులుగా ఎప్పటికీ అక్కడే ఉండనున్నాయి.
విక్రమ్, ప్రజ్ఞాన్‌లను స్లీప్ మోడ్‌కి ఎందుకు పంపారు?
రోవర్ ప్రజ్ఞాన్, విక్రమ్ ల్యాండర్లను స్లీప్ మోడ్‌లోకి పంపడం వెనుక ఉన్న అతిపెద్ద కారణం అక్కడ రాత్రి కావడమే. అక్కడి రాత్రి అనేది భూమిపై 14 రోజులకు సమానం. ఈ సమయంలో చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉష్ణోగ్రత మైనస్ 200 డిగ్రీల కంటే తక్కువగా ఉండవచ్చు. దీని కారణంగా చంద్రయాన్ -3 ల్యాండర్, ప్రజ్ఞాన్ స్తంభింపజేయవచ్చు. దీనివల్ల ఈ సమయంలో ల్యాండర్ రోవర్ రెండూ కూడా పని చేయవు. అందుకే ఈ రెండింటిని స్లీప్ మోడ్‌కి పంపారు.
చంద్రునిపై విక్రమ్, ప్రజ్ఞాన్ ఇప్పటివరకు ఎలాంటి పరిశోధన చేశాయి?
రోవర్ 'ప్రజ్ఞాన్' ల్యాండర్ 'విక్రమ్' ఇప్పటివరకు చంద్రునిపై చాలా పరిశోధన చేశాయి. ఈ పరిశోధన డేటా మొత్తం ఇస్రోకు పంపింది. 'చంద్రయాన్-3' మిషన్ పరీక్షల అనంతరం చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు రుజువు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్ష పరిశోధనకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజ్ఞాన్ రోవర్‌పై అమర్చిన ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోస్కోప్ (APXS) పరికరం కూడా చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్, కొన్ని ఇతర మూలకాల ఉనికిని నిర్ధారించిందని ఇస్రో తెలిపింది.
దీనితో పాటు 'లేజర్-ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) పరికరం చంద్రుని సంబంధిత ప్రాంతంలో సల్ఫర్, ఇతర మూలకాల ఉనికిని గుర్తించిందని ఇస్రో ప్రకటించింది. ఊహించినట్లుగానే LIBS పరికరం అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్లను గుర్తించిందని ఇస్రో తెలిపింది.
చంద్రయాన్-3 తర్వాత ఆదిత్య ఎల్-1 నుంచి అంచనాలు
చంద్రయాన్-3 విజయం తర్వాత శనివారం ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 నుంచి సూర్యుడి రహస్యాన్ని అన్వేషిస్తుందని ఆశలు చిగురిస్తున్నాయి. ఇస్రో తెలిపిన వివరరాల ప్రకారం.. ఆదిత్య-L1 సూర్యుడిని అధ్యయనం చేసిన మొదటి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ. ఈ వ్యోమనౌక భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరం 125 రోజుల్లో ప్రయాణించి, సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ 'ఎల్1' చుట్టూ హాలో ఆర్బిట్‌లో ఏర్పాటు చేయబడుతుంది. అక్కడి నుంచి సూర్యునిపై జరిగే వివిధ సంఘటనలను అధ్యయనం చేస్తుంది.
సూర్య-భూమి L1 పాయింట్ వద్ద భారతదేశపు మొట్టమొదటి సౌర అబ్జర్వేటరీని పంపించడం ద్వారా సూర్యుని బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేయడం ఈ మిషన్ లక్ష్యం. L1 అంటే 'లాగ్రాంజ్ పాయింట్ 1'. ఇక్కడ స్పేస్‌క్రాఫ్ట్ ఇన్స్టాల్ చేయబడుతుంది. ఆదిత్య-ఎల్1 సూర్యుడిపై దిగబోదని, సూర్యుడికి దగ్గరగా వెళ్లదని ఇస్రో స్పష్టం చేసింది. ఆదిత్య-ఎల్1 భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. ఈ దూరం భూమి, సూర్యుని మధ్య ఉన్న మొత్తం దూరంలో ఒక శాతం. అంతరిక్ష నౌక ఇక్కడికి చేరుకోవడానికి 125 రోజులు పడుతుంది.
లాగ్రాంజ్ పాయింట్ అంటే ఏమిటి?
భూమి, సూర్యుని మధ్య ఐదు 'లాగ్రాంజియన్' పాయింట్లు ( పార్కింగ్ ప్రాంతాలు) ఉన్నాయి. వాటిని చేరుకున్న తర్వాత ఆదిత్య ఎల్1 అక్కడ ఆగిపోతుంది. లాగ్రాంజ్ పాయింట్లకు ఇటాలియన్-ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు జోసెఫ్-లూయిస్ లాగ్రాంజ్ తన ప్రైజ్-విన్నింగ్ పరిశోధనా పత్రం 'ఎస్సే సుర్ లే ప్రాబ్లెమ్ డెస్ ట్రోయిస్ కార్ప్స్, 1772' పేరు పెట్టారు. లాగ్రాంజ్ పాయింట్ వద్ద సూర్యుడు, భూమి వంటి ఖగోళ వస్తువుల మధ్య గురుత్వాకర్షణ శక్తి ఒక కృత్రిమ ఉపగ్రహంపై సెంట్రిపెటల్ ఫోర్స్‌తో సమతుల్యం చేస్తుంది. సూర్య మిషన్‌కు 'ఆదిత్య ఎల్-1' అని పేరు పెట్టారు, ఎందుకంటే ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజియన్ పాయింట్ 1 (ఎల్1) ప్రాంతంలో ఉండి తన అధ్యయన పనిని నిర్వహిస్తుంది.