Wed Jan 01 2025 05:03:00 GMT+0000 (Coordinated Universal Time)
చీప్ ట్రిక్స్.....చీపురు కట్ట కాదూ?
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అందరి రాజకీయ నేతల్లాగా తయారయ్యారు. ఆయనపై ప్రత్యేకంగా పెట్టుకున్న ఆశలు ఆవిరయిపోతున్నాయి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అందరి రాజకీయ నేతల్లాగా తయారయ్యారు. ఆయనపై ప్రత్యేకంగా పెట్టుకున్న ఆశలు ఆవిరయిపోతున్నట్లే కనిపిస్తున్నాయి. ఆయన కూడా మిగిలిన రాజకీయ నేతలకు భిన్నం కాదని అర్థమవుతుంది. గెలుపే లక్ష్యంగా, అధికారంలోకి రావడానికి కేజ్రీవాల్ కూడా ఇతర రాజకీయ నేతల్లాగానే వ్యవహరిస్తారని అర్థమయింది. ఉచితాలకు ఆయన ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజా సేవకుడిగా కాకుండా ఫక్తు రాజకీయ నేతగా మారాడన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ప్రజా సంక్షేమానికి...
అవినీతికి తావులేకుండా పాలన చేస్తానని ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టారు. పేదలకు విద్య దగ్గర నుంచి వైద్యం వరకూ ఆయన తీసుకున్న, అమలు పర్చిన నిర్ణయాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు మోడల్ గా నిలిచాయి. మొహల్లా క్లినిక్ లను వీధి వీధినా ఏర్పాటు చేయడం, విద్యను మెరుగుపర్చేందుకు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం వంటి చర్యలతో అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.
అందుకేనా?
అంతవరకూ బాగానే ఉన్నా .. ఆయనకు ప్రధాని పదవి పై మనసు పడినట్లుంది. వరసగా రాష్ట్రాల్లో గెలిచి ప్రధాని పీఠాన్ని అందుకోవాలన్న ఆశ ఆయనలో ఉన్నట్లుంది. పంజాబ్ లో అలివికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వాటిని అమలు చేసే పరిస్థితులు లేవు. కేంద్రం నుంచి సహకారం కూడా ఉండదు. ఈ నేపథ్యంలో గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన వాగ్దానం రాజకీయ నేతలను మాత్రమే కాకుండా మేధావులను సయితం ఆశ్చర్య చకితుల్ని చేసింది. గోవా ఎన్నికల్లోనూ ఇలాగే ఉచిత హామీలిచ్చినా అక్కడి ప్రజల ఆదరణను కేజ్రీవాల్ చూరగొనలేకపోయారు.
ఐఆర్ఎస్ అధికారిగా....
అరవింద్ కేజ్రీవాల్ ఐఆర్ఎస్ అధికారి. ఆయనకు ఆర్థిక పరిస్థితుల గురించి తెలియనివి కావు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 300 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్తును అందిస్తానని ఆయన చెప్పడం ఇప్పుుడు హాట్ టాపిక్ గా మారింది. గృహవినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆయన ప్రయత్నించారని అర్థమవుతుంది. గుజరాత్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఎదగవచ్చని అనుకున్నట్లుంది. అందుకే 24/7 విద్యుత్తును అందించడమే కాకుండా 300 యూనిట్ల వరకూ ఉచితం అనడం పట్ల కేజ్రీవాల్ పై ఇప్పటి వరకూ ఉన్న గౌరవం పోయేలా ఉంది. అందరి రాజకీయ నేతల తరహాలోనే అధికారం కోసం అలివికాని హామీలిచ్చేందుకు ఆయన సిద్ధమవ్వడం ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
.
Next Story