Wed Nov 20 2024 06:44:29 GMT+0000 (Coordinated Universal Time)
మరో బిల్లుతో మళ్లీ వస్తాం.. అసెంబ్లీలో జగన్
మూడు రాజధానుల బిల్లులను, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
మూడు రాజధానుల బిల్లులను, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో ఆయన ఒక ప్రకటన చేశారు.
"మూడు రాజధానుల నిర్ణయం ఎలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందో అందరికీ తెలుసు. 1953లో కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఉండేది. తర్వాత రెండు హైదరాబాద్ కు తీసుకు పోవడం జరిగింది. శ్రీబాగ్ ఒప్పందం చేసి మరీ తరలించారు. అమరావతిలో రాజధాని పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అప్పట్లో అది వివాదాస్పదం అయినా సమర్థించాను. ఈ ప్రాంతంలోనే నా ఇల్లు ఉంది. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ కూడా. రాజధాని ప్రాంతం ఇటు విజయవాడ కాదు. అటు గుంటూరు కాదు.
లక్ష కోట్ల ఖర్చు....
కొత్త రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటే గత ప్రభుత్వం లెక్కల ప్రకారం లక్ష కోట్లు ఖర్చవుతుంది. చంద్రబాబు రాజధాని ఊహాచిత్రంతో ప్రజలను మోసం చేశారు. రాజధాని ఎప్పటికొస్తుంది? ఉద్యోగాల కోసం పిల్లలు ఎక్కడకు వెళ్లాలి? హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. విశాఖపట్నం వంటి అభివృద్ధి చెందిన నగరంలో పెట్టి ఉంటే హైదరాబాద్ తో ఐదేళ్ల కయినా పోటీ పడే పరిస్థితి వచ్చింది. అమరావతిలో అభివృద్ధి ఎన్నేళ్లు పుడుతుందో ఎవరికీ తెలియదు.
అభివృద్ధి వికేంద్రీకరణ...
అందుకే విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయరాజధానిని పెట్టాలని భావించాం. మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనుకున్నాం. ఇది అనుకున్న నాటి నుంచి రకరకాలుగా అపోహలు సృష్టిస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు తెస్తున్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చి ఉండేవి. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టాం. 2019 ఎన్నికల్లో ప్రజలు తీర్పు ద్వారా స్పష్టమయింది.
ఇప్పటికీ అదే నమ్ముతున్నా....
వికేంద్రీకరణ సరైన విధానమని నమ్మి బలంగా ముందుకు అడుగు వేశాం. అందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయబట్టే గడచిన రెండున్నరేళ్లలో జరిగిన ఎన్నికలలో ప్రజలు దీవిస్తూ వస్తున్నారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ వాదనను పక్కన పెట్టి కొందరికి అన్యాయం జరుగుతుందని ప్రచారం చేశారన్నారు. ప్రభుత్వ సదుద్దేశ్యాన్ని వివరించేందుకు, చట్టపరంగా, న్యాయపరంగా బిల్లులోనే సమాధానం చెప్పేందుకు, బిల్లులను మరింత బలంగా రూపొందించేందుకు గతంలో ప్రవేశ పెట్టిన బిల్లులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుంది. మరింత మెరుగైన బిల్లుతో ప్రభుత్వం సభ ముందుకు వస్తుంది. విస్తృత, విశాల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం." అని జగన్ అన్నారు.
Next Story