Thu Dec 19 2024 17:51:32 GMT+0000 (Coordinated Universal Time)
కనికరం లేదు.. ఇక కఠిన నిర్ణయాలే
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సిద్దమవుతున్నట్లే కనిపిస్తుంది. కనికరం లేకుండా సీరియస్ గానే ఉందామని నిర్ణయించుకున్నట్లుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సిద్దమవుతున్నట్లే కనిపిస్తుంది. కనికరం లేకుండా సీరియస్ గానే ఉందామని నిర్ణయించుకున్నట్లుంది. "ఎలాంటి బంధు ప్రీతి లేదు. రాజీ లేదు. ఎవరు కష్టపడితే వారికే టిక్కెట్లు. ఎవరు అలిగినా సరే. ఎవరు ఏమనుకున్నా సరే. ఎవరు బాధపడినా నాకేం పరవాలేదు. గెలిచే వారికే టిక్కెట్లు. ఆరునెలల్లో కఠిన నిర్ణయాలుంటాయి." అంటూ జగన్ నిర్ద్వందంగా జగన్ వ్యాఖ్యానించారు.. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలను మారుస్తారని ఎప్పటి నుంచో వినపడుతుంది. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం వర్క్ షాప్ లో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యమని వ్యక్తుతు కాదని జగన్ నిర్మొహమాటంగా చెప్పారు.
సీరియస్ వార్నింగ్...
అంతర్గత సర్వేల్లో స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగా అధికారాన్ని కోల్పోవడానికి జగన్ ఇష్టపడటం లేదు. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదిక జగన్ తెప్పించుకుంటున్నారు. నియోజకవర్గాల్లో గ్రూపుల గోల, వర్గ విభేదాలను కూడా సహించబోనని జగన్ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. తాను చేయాల్సింది తాను చేస్తున్నానని, మీరు చేయాల్సింది మీరు చేయాలని జగన్ ఎమ్మెల్యలతో జగన్ అన్నారు. తాను చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు సరిగా పనిచేయకపోతే రిజల్ట్ లో తేడా కొడుతుందని జగన్ సీరియస్ గానే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.
మూడేళ్ల తర్వాత...
ఇక మూడేళ్ల వరకూ పెద్దగా పట్టించుకోని ఎమ్మెల్యేలపై వరాలు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి రెండు కోట్ల అభివృద్ధి నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 350 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రెండు కోట్ల రూపాయలతో నియోజకవర్గాల అభివృద్దికోసం వెచ్చించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధుల కింద ఈ నిధులను విడుదల చేయనుంది. ఈ నిధులను తమ నియోజకవర్గాల్లో ఉండే తక్షణ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి పనులు చేయలేక వెనకడుగు వేస్తున్న ఎమ్మెల్యేల్లో ఈ నిధులు జోష్ పెంచాలనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సచివాలయానికి ....
ఇక గ్రామ సచివాలయానికి కూడా ఇరవై లక్షలు జగన్ ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రతి నియోజకవర్గంంలో 80 వరకూ గ్రామ సచివాలయాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 1.60 కోట్ల నిధులు కేటాయింపు జరుగుతుంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు. ఇప్పటి వరకూ జగన్ సంక్షేమాన్ని మాత్రమే పట్టించుకున్నారు. బటన్ నొక్కి లబ్దిదారులకు నగదును అందచేస్తున్నారు. ఇక రెండేళ్లు మాత్రమే ఎన్నికలు ఉండటంతో ఊహించినట్లుగానే అసంతృప్తిగా ఉన్న కొన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను తనవైపునకు తిప్పుకునేందుకు ఈ నిధులను విడుదల చేసినట్లే కనపడుతుంది. వరసగా రెండేళ్లు ఈ నిధులతో పాటు అదనపు అభివృద్ధి పనులను కూడా జగన్ చేపట్టనున్నారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Next Story