Mon Dec 23 2024 07:42:48 GMT+0000 (Coordinated Universal Time)
ఎదర ఎర్రజెండా.. వెనక పసుపు అజెండా.. కామ్రేడ్ల పై జగన్ ఫైర్
ముఖ్యమంత్రి జగన్ చాలా రోజుల తర్వాత రాజకీయంగా ఫైర్ అయ్యారు. ముఖ్యంగా కమ్యునిస్టుల అజెండాను ఆయన తప్పుపట్టారు.
ముఖ్యమంత్రి జగన్ చాలా రోజుల తర్వాత రాజకీయంగా ఫైర్ అయ్యారు. ముఖ్యంగా కమ్యునిస్టుల అజెండాను ఆయన తప్పుపట్టారు. సాధారణంగా జగన్ తెలుగుదేశం పార్టీ మీద, ఎల్లో మీడియా మీద తరచూ ఆరోపణలు చేస్తుంటారు. కానీ ఈసారి కమ్యునిస్టులపై పడ్డారు. ఇటీవల జరిగిన చలో విజయవాడ కార్యక్రమం, ప్రస్తుతం ఉపాధ్యాయ సంఘాలు నిరసనలకు సిద్ధమవుతుండటం వెనక కమ్యునిస్టులు ఉన్నట్లు జగన్ గుర్తించి కమ్యునిస్టులపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది. ఎన్నడూ కామ్రేడ్లపై కనీసం మాట తూలని జగన్ ఈసారి తీవ్ర వ్యాఖ్యలు చేయడం విశేషం.
కామ్రేడ్లు ఇలా....
ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న వ్యక్తి ఈరోజు రామోజీరావుకు ముద్దుబిడ్డగా ఉన్నారన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న వ్యక్తి ఆంధ్రజ్యోతి కి ముద్దుబిడ్డ అయ్యారన్నారు. బీసీలు పనికిరారని కేంద్రానికి రాసిన వ్యక్తి నేడు ఎర్రజెండాలకు ఆత్మీయత వ్యక్తిగా మారారని చెప్పారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కామ్రేడ్లు జెండాలు పట్టుకునే రోజు వచ్చిందన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టులో పిటీషన్ వేసిన చంద్రబాబుకు కామ్రేడ్లు మద్దతు పలుకుతున్నారంటే ఏ స్థాయికి రాజకీయాలు దిగజారిపోయారో నని వైఎస్ జగన్ అన్నారు.
ఉద్యోగుల సమ్మెపై...
ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ఎవరూ కోరుకోరని, రెండున్నరేళ్ల నుంచి లంచాలకు, వివక్షతకు తావులేకుండా 1,27,000 కోట్లు అందుకున్న ఏ కుటుంబమూ సమ్మె కోరుకోదని, సమ్మె కావాల్సింది చంద్రబాబు సీఎం కాలేదు అన్న బాధ, కడుపుమంట ఉన్నవారికే కావాలన్నారు. బాబు దత్తపుత్రుడికి, ఎర్రజెండాల వారికి, మీడియా ముసుగులో వత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియాకు సమ్మె కావాలని జగన్ అన్నారు. సమ్మె విరమించారంటే ఏడుపు మొహం పెట్టారన్నారు. పచ్చ జెండాల ముసుగులో ఎర్ర సోదరులు ముందుకు వచ్చారు. ఎదర ఎర్ర జెండా.. వెనక పసుపు అజెండా అని జగన్ ఫైర్ అయ్యారు. కమ్యునిస్టుల ప్రోద్బలంతో ఉద్యమాలు చేయాలని భావిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిని తిడితే బాగా కవరేజీ ఇస్తామని ఎల్లో మీడియా ఆఫర్లు ఇస్తుందన్నారు.
Next Story