Mon Dec 23 2024 16:44:27 GMT+0000 (Coordinated Universal Time)
అందరికీ టిక్కెట్లు.. ఎవరికి అడ్వాంటేజీ
ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్ లు అందరికీ టిక్కెట్లని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను ఎవరినీ మార్చబోమని చెప్పారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్ లు అందరికీ టిక్కెట్లని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను ఎవరినీ మార్చబోమని మరోసారి తేల్చి చెప్పారు. గతంలో కేసీఆర్ నుంచి ఇలాంటి ప్రకటన వచ్చినప్పటికీ ఎమ్మెల్యేలు కూడా నమ్మలేదు. అవసరాలు, సర్వే రిపోర్టులను బట్టి సిట్టింగ్ లను మారుస్తారని అనుకున్నారు. తమ భవిష్యత్ ఏంటన్న ఆందోళనలో ఉన్నారు. దీంతో పాటు తమ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతల నుంచే పోటీ వస్తుందని భావించారు. కానీ కేసీఆర్ మరోసారి సిట్టింగ్ లందరికీ సీట్లు గ్యారంటీ అని ప్రకటన చేయడంతో వారిలో ఉత్సాహం నెలకొంది.
అభ్యర్థులను మార్చడం...
సాధారణంగా ఎన్నికల సమయంలో పార్టీ అధినేతలు అభ్యర్థులను మార్చడం ఆనవాయితీగా వస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని తొలగించుకునేందుకు ఎవరేమనుకున్నా కొందరిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70 మంది సిట్టింగ్ లను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశమిచ్చి మరోసారి పార్టీని అధికారంలోకి తెచ్చిన విషయాన్ని కొందరు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అందుకే కేసీఆర్ మూడో సారి అధికారంలోకి రావడానికి ఇదే రకమైన ప్రయోగాన్ని చేస్తారని ఎమ్మెల్యేలు కొందరు భావించారు. బితుకు బితుకుమంటూ టిక్కెట్ వస్తుందో? రాదో? అంటూ భయపడుతున్న సమయంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ భరోసాను నింపాయి.
భరోసా నింపేందుకేనా?
ఒకరకంగా నిస్తేజంగా ఉన్న కొందరు ఎమ్మెల్యేల్లో కేసీఆర్ భరోసా నింపినట్లయింది. మరోసారి గెలిచేందుకు పది నెలలు శ్రమించేందుకు కేసీఆర్ వ్యాఖ్యలు తోడ్పడతాయి. కానీ కొన్ని సీట్ల విషయంలో ఇబ్బందులు తప్పేట్లు లేవు. సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇస్తే కొందరు పార్టీని వీడే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యమైన నేతలు అలక బూనవచ్చు. కానీ వారికి ఏదో రకంగా భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమయినట్లే కనిపిస్తుంది. ఎమ్మెల్సీయో, రాజ్యసభ పదవో, నామినేటెడ్ పదవో ఇచ్చి సంతృప్తి పర్చాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉండవచ్చు. కానీ ఇది ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతుందో అన్నది చూడాల్సి ఉంది.
కామ్రేడ్లలో కలవరం....
వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలసి వెళ్లాలని దాదాపుగా కేసీఆర్ నిర్ణయించారు. వారికి ఎలా లేదన్నా ఇరవై స్థానాల వరకూ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సిట్టింగ్ లకే సీట్లు అని లెఫ్ట్ పార్టీలను కేసీఆర్ పక్కన పెట్టారా? లేదా సిట్టింగ్ లలో జోష్ నింపేందుకే ఈ కామెంట్స్ చేశారా? అన్నది భవిష్యత్ లో తేలనున్నా ఇప్పుడు మాత్రం సిట్టింగ్ లకు ఊరట కలిగించింది. కలసి వెళదామనుకుంటున్న కామ్రేడ్లలో కొంత కలవరం రేప వచ్చు కాని, కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఎమ్మెల్యేలు కట్టుబడి ఉండాల్సిన పరిస్థిితి. వారికి అంతకు మించి మరో ఛాన్స్ లేకుండా చేయడంలో కేసీఆర్ కు మించిన లీడర్ లేరనేది వాస్తవం. అందుకే కేసీఆర్ కామెంట్స్ వారికి కొంత ఊరటనిచ్చినా భయం మాత్రం పూర్తిగా తొలగిపోలేదనే చెప్పాలి.
- Tags
- kcr
- sitting mlas
Next Story