Sat Nov 16 2024 14:41:59 GMT+0000 (Coordinated Universal Time)
ఇవేం రాతలయ్యా...? రాష్ట్రానికి ఒక రూలా?
ఇంగ్లీష్ మీడియంను తెలంగాణలోనూ ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. కానీ మీడియాకు మాత్రం పట్టలేదు
జగన్ ఏది చేసినా తప్పే. ఏ నిర్ణయం తీసుకున్నా భూతద్దంలోనే చూపుతారు. ఆంధ్రప్రదేశ్ లో తీసుకునే ప్రతి నిర్ణయం వెనక జగన్ స్వార్థ పూరిత ధోరణి కనపడుతుంది. ఇది ఒకవర్గం మీడియా అనుసరిస్తున్న వైఖరి. జగన్ అడుగు తీసి అడుగు వేస్తే చాలు.. ఆయన వెనకనే ఆరోపణలు గుప్పిస్తూ పెద్ద పెద్ద కథనాలు వెలువడతాయి. కానీ అదే నిర్ణయం ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తే మాత్రం అది మాత్రం ఆ మీడియాకు కనపడదు.
ఎంత యాగీ?
ఎంత యాగీ చేశారు. జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడతానని మాట చెప్పగానే ఒక వర్గం మీడియా ఊగిపోయింది. అమ్మ భాష అంటూ అరుపులు, కేకలు వేసింది. ఆవు కధలు చెప్పింది. జగన్ వల్ల తెలుగు భాష సర్వనాశనం అయిపోయిందన్న కలరింగ్ ఇచ్చేసింది. ఇక తెలుగుకు జగన్ తెగులు పట్టించేశాడని కన్నీరు కార్చేసింది. రోజూ తెలుగు భాష, దాని ప్రాశస్త్యంపై కథనాలను వండి వార్చింది.
పేద విద్యార్థుల కోసం....
నిజానికి తెలుగు మీడియంను రద్దు చేస్తానని జగన్ చెప్పలేదు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతానని మాత్రమే చెప్పారు. తెలుగు సబ్జెక్ట్ కూడా ఉంటుందని చెప్పారు. పేద విద్యార్థులకు, ముఖ్యంగా దళిత, మైనారిటీలకు ఇంగ్లీష్ మీడియం భవిష్యత్ లో అక్కరకు వస్తుందని అన్నారు. అదే పాపమయింది. కార్పొరేట్ స్కూళ్లు మూత పడతాయోమనన్న కంగారులో ఏవేవో కథలు చెప్పింది. జగన్ మాత్రం తాను అనుకున్న దానికి కట్టుబడి ఉన్నారు.
కానీ ఇక్కడ మాత్రం....
కానీ ఇదే ఇంగ్లీష్ మీడియంను తెలంగాణలోనూ ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. కానీ తెలంగాణలోది తెలుగు కాదేమో. ఆ వర్గం మీడియాకు మాత్రం పెద్ద బాధగా అనిపించలేదు. అమ్మ భాష పై ఎటువంటి కథనాలను రాయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుపట్టలేదు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది తెలుగు కాదా? ఏపీలో తెలుగుకు జరిగే నష్టం తెలంగాణలో తెలుగుకు జరగదా? ఈ మీడియాకు ఇదేమి న్యాయం? ముఖ్యమంత్రులను బట్టి స్టాండ్ ను మార్చుకుంటాయా? అంటే అవుననే అనక తప్పదు.
Next Story