Wed Nov 27 2024 13:04:43 GMT+0000 (Coordinated Universal Time)
చరిత్రను వక్రీకరిస్తున్నారు.. మంటలు రగిలిస్తున్నారు
జాతీయ సమైక్యత దినోత్సవంగా భావించే సెప్బంబరు 17ను కొందరు తమ స్వార్థం కోసం వక్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు
జాతీయ సమైక్యత దినోత్సవంగా భావించే సెప్బంబరు 17ను కొందరు తమ స్వార్థరాజకీయాల కోసం వక్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ సమాజం రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య స్వేచ్ఛ వైపునకు పయనించిన రోజు ఇది అని అన్నారు. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ఆనాటి ఉద్యమంలో ప్రజలంతా ఏకమయ్యారన్నారు. ఎందరో త్యాగధనుల ఫలితమే తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ లభించిందని కేసీఆర్ అన్నారు. కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య సాహసాలను మర్చిపోలేమన్నారు. ఆనాడు ఉజ్వల ఉద్యమం నడిచిందన్నారు. ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని కలిగించారన్నారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అనేక కష్టాలు పడ్డామన్నారు.
సాధించుకున్న రాష్ట్రంలో...
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి తమను బానిసలుగా చూస్తున్నారన్న భావన తెలంగాణ ప్రజల్లో నెలకొందని ఆయన అన్నారు. కానీ పథ్నాలుగేళ్లు తాను ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. అనేక పోరాటాలతో స్వరాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. అన్ని పార్టీలను మెప్పించి, ఒప్పించి తెలంగాణను తెచ్చుకున్నామని తెలిపారు. ఎనిమిదేళ్లలో తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తును 24 గంటలూ అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణాయేనని తెలిపారు. కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో నేడు కోటి ఎకరాలకు సాగు నీరు అందించామని కేసీఆర్ అన్నారు. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు.
చిల్లర రాజకీయాలతో....
హరిత తెలంగాణగా తీర్చిదిద్దుకున్నామని తెలిపారు. పారిశ్రామికంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. 2,32,111 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాల సృష్టిలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు. అన్ని గ్రామాలకు మౌలిక వసతులు సమకూర్చామన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ఈ తరుణంలో మతతత్వ శక్తులు బయలుదేరి తెలంగాణ ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయన్నారు. విధ్వేషపు మంటలు రగిలించడం సమర్థనీయం కాదని కేసీఆర్ తెలిపారు. మానవ సంబంధాలను మంటగలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆనాటి చరిత్రతో, సంఘటనలతో సంబంధం లేని ఈ ఆషాఢభూతులు మలినం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వీరి కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టడం మనందరి ప్రధమ కర్తవ్యమని ఆయన అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని కేసీఆర్ అన్నారు.
Next Story