Mon Dec 23 2024 04:25:18 GMT+0000 (Coordinated Universal Time)
"ఆళ్ల"కుఇచ్చాడు.. ఇక భరత్ మిగిలాడు
కుప్పంలో వచ్చే ఎన్నికల్లో భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవిని ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు
జగన్ మంత్రి పదవి ఇస్తానని చెప్పడం ఇప్పటి నుంచి కాదు. గత ఎన్నికల నాటి నుంచే ఆయన వరసగా మంత్రి హామీ ఇస్తూ వెళుతున్నారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే ఖచ్చితంగా కేబినెట్ లోకి తీసుకుంటానని జగన్ నాడు ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజలకు హామీ ఇచ్చారు. కాని తొలి, మలి విడత కేబినెట్ విస్తరణలో ఆళ్లకు చోటు లేదు. సామాజికవర్గం సమీకరణాల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయామని జగన్ చెబుతున్నా మాట తప్పారని మాత్రం ఆళ్ల సన్నిహితులు, అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు.
భరత్ ను గెలిపిస్తే...
ఇప్పుడు తాజాగా కుప్పంలో వచ్చే ఎన్నికల్లో భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవిని ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. కుప్పం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలలో పోటీ చేసిన చంద్రమౌళి కుమారుడు భరత్ కు జగన్ కొద్దికాలం క్రితం ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వొచ్చు కదా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు, ప్రజలను పార్టీ వైపునకు తిప్పుకునేందుకు జగన్ మంత్రి పదవి ఆశ చూపుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
మీ చేతులలోనే అంటూ....
జగన్ నిన్న జరిగిన కుప్పం నియోజకవర్గం క్యాడర్ తో జరిగిన సమావేశంలో ఒక క్లారిటీ మాత్రం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పై కుప్పంలో పోటీ చేసేది భరత్ అని చెప్పకనే చెప్పారు. క్యాడర్ తో మాట్లాడిన జగన్ భరత్ ను వచ్చే ఎన్నికలలో గెలిపించుకుని తీసుకువస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. భరత్ ను ఉన్నతస్థాయిలోకి తీసుకెళ్లాలా? లేదా? అన్నది మీ చేతుల్లో ఉందని కార్యకర్తలకు జగన్ అనడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.
వైసీపీ నేతల్లోనే...
వచ్చే ఎన్నికలలో భరత్ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడా? లేదా? అన్నది పక్కన పెడితే చిత్తూరు జిల్లాకు చెందిన నేతలే ఆయన ఓటమికి కారణాలయ్యే అవకాశాలున్నాయి. తమ మంత్రి పదవికి భరత్ అడ్డుపడతాడని కొందరు నేతలు కుప్పంలో టీడీపీ గెలవాలని కోరుకుంటారు. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంత్రి పదవులను ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వైసీపీలో సీనియర్ నేతలు కూడా ఇక్కడే ఉన్నారు. దీంతో భరత్ గెలుపునకు వైసీపీ నేతల నుంచి అడ్డంకులు ఏర్పడతాయన్న కామెంట్స్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అయినా.. మాట ఇచ్చిన మాత్రాన జగన్ భరత్ కు మంత్రి పదవి ఇవ్వొద్దూ.. అన్న వెటకారపు వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇచ్చిన మాటను ఈ సందర్భంగా కొందరు గుర్తు చేసుకుంటున్నారు.
Next Story