Fri Nov 08 2024 22:06:15 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దల సభకు మర్రి.. జగన్ గ్రీన్ సిగ్నల్
మర్రి రాజశేఖర్ కు రాజ్యసభ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
పదవి ఎప్పుడు ఎక్కడ రాసి పెట్టి ఉంటుందో ఎవరికీ తెలియదు. కొందరికి ఊహించని విధంగా పదవులు దక్కుతుంటాయి. మరికొందరికి ఎంత ప్రయత్నించినా పదవి అనేది వారికి అందదు. విసిగిపోయి వారు అలా నిరీక్షించాలి. లేకుంటే పార్టీ మారాలి. ఇప్పడు గుంటూరు జిల్లా నేత మర్రి రాజశేఖర్ ది కూడా అదే పరిస్థితి. మర్రి రాజశేఖర్ కు రాజ్యసభ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
తొలి నుంచి పార్టీలో....
మర్రి రాజశేఖర్ కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. ఆయన చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్యే అవకాశం లభించింది. వైఎస్ మరణం తర్వాత జగన్ వైసీపీ పెట్టడంతో అందులోకి వచ్చారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మర్రి రాజశేఖర్ ను జగన్ 2019 ఎన్నికలకు ముందు వరకూ అమితంగానే ప్రేమించేవారు.
అందరికీ ఇచ్చినా....
2019 ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ కు సామాజిక సమీకరణాల్లో భాగంగా జగన్ టిక్కెట్ ఇవ్వలేక పోయారు. విడదల రజనీకి టిక్కెట్ ఇచ్చారు. అయినా మర్రి రాజశేఖర్ కు పార్టీ కోసం పనిచేశారు. కానీ మూడేళ్లవుతున్నా ఆయనకు పదవి ఇవ్వకపోవడం పార్టీలోనే విమర్శలకు తావిచ్చింది. ఎంతో మందికి జగన్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. మంత్రి పదవి కూడా ఇస్తానన్న జగన్ మాత్రం రాజశేఖర్ ను పట్టించుకోలేదు. కమ్మ సామాజికవర్గంలోనూ రాజశేఖర్ కంటే వెనక వచ్చిన వారికి పదవులు దక్కాయి.
చివరకు రాజ్యసభకు....
దీంతో మర్రి రాజశేఖర్ కుటుంబం నుంచి కూడా జగన్ పై విమర్శలు వచ్చాయి. మర్రి రాజశేఖర్ రాజకీయాలు మాని న్యాయవాది వృత్తిలోకి కూడా వెళ్లారు. అయితే రెండు, మూడు రోజుల క్రితం జగన్ మర్రి రాజశేఖర్ ను తాడేపల్లికి పిలిపించుకుని ఆయనకు స్పష్టం చేసినట్లు తెలిసింది. రాజ్యసభకు వెళ్లాలని కోరినట్లు చెబుతున్నారు. రానున్న మార్చి నాటికి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఒకటి మర్రి రాజశేఖర్ కు ఫిక్స్ చేశారు. అయితే మర్రి మాత్రం శాసనమండలిని కోరుకుంటున్నా, జగన్ మాత్రం ఆయనను రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయ్యారు.
Next Story