Fri Dec 27 2024 18:27:47 GMT+0000 (Coordinated Universal Time)
ఈ కేబినెట్ తో కుదిరే పని కాదా?
మంత్రులు దేనినీ పట్టించుకోవడం లేదన్న అసహనంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు
ప్రస్తుత మంత్రి వర్గం పై ముఖ్యమంత్రి జగన్ అసంతృప్తిగా ఉన్నారా? త్వరలో మంత్రివర్గాన్ని ఆయన విస్తరించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రస్తుత మంత్రులు దేనినీ పట్టించుకోవడం లేదన్న అసహనంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు, విపక్షాల విమర్శలను కూడా తిప్పికొట్టడానికి తీరిక లేకుండా మంత్రులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అందుకే ఈ మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన పలికితే మిగిలిన వారు అప్రమత్తమవుతారన్న ఆలోచనతో జగన్ ఉన్నారని చెబుతున్నారు.
గత మంత్రివర్గం...
తొలి మంత్రి వర్గంలో మూడేళ్ల పాటు జగన్ మంత్రివర్గ సభ్యులపై ఈ స్థాయిలో అసహనం వ్యక్తం చేయలేదు. ఆ బ్యాచ్ లో విపక్షాలకు ధీటుగా విమర్శించే వారు ఎక్కువగా ఉన్నారు. నిత్యం మీడియా సమావేశాలతో విపక్షాలపై విరుచుకుపడేవారు.కానీ ప్రస్తుత మంత్రివర్గం అందుకు భిన్నంగా ఉంది. ముగ్గురు నలుగురు మంత్రులు మినహా ఎవరూ పెద్దగా రెస్పాన్స్ కావడం లేదు. అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా, గుడివాడ అమరనాధ్ వంటి వారు మినహా సీనియర్ మంత్రులు ధర్మాన ప్రసాదరావు లాంటి వారు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.
సీనియర్లు కూడా...
సీనియర్లకు మంత్రి పదవులు ఇచ్చినా వారు మౌనంగా ఉండటాన్ని ముఖ్యమంత్రి జగన్ తప్పుపడుతున్నారు. ప్రభుత్వం పై నిందలు మోపుతున్నా నోరు మెదపక పోవడం నిర్లక్ష్యమా? లేదా నిరాసక్తతా? అన్నది తెలియకుండా ఉందని ఆయన అన్నట్లు తెలిసింది. జగన్ మాత్రం 60 శాతం మంది మంత్రులపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ కేబినెట్ తో ఎన్నికలకు వెళ్లడం కష్టమేనని జగన్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిని కూడా కేబినెట్ లోకి తీసుకున్నానని, సీనియారిటీని పక్కన పెట్టి సామాజికవర్గాలకే ప్రాధాన్యత ఇచ్చినా మంత్రులు ఈ రకంగా వ్యవహరించడం సరికాదని జగన్ అభిప్రాయపడుతున్నారు.నవంబరులో మరోసారి...
అందుకే నవంబరులో మంత్రి వర్గాన్ని మరోసారి విస్తరించాలని జగన్ అభిప్రాయపడుతున్నారు. ఈలోపు మంత్రులు తమ పనితీరు మార్చుకోవాలని జగన్ ఇప్పటికే హెచ్చరించారు. అయినా కొందరు మంత్రుల పనితీరు పట్ల సంతృప్తికరంగా లేరు. ఒకరిద్దరు మంత్రులను మార్చాలని జగన్ డిసైడ్ అయ్యారంటున్నారు. అందులో మహిళ మంత్రి కూడా ఒకరున్నారని తెలిసింది. ఎన్నికలకు వెళ్లాలంటే ఈ కేబినెట్ తో కుదరదన్న అభిప్రాయానికి జగన్ వచ్చినట్లు తెలిసింది. అందుకే కేబినెట్ ను నవంబరు నెలలో మార్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Next Story