Tue Dec 24 2024 02:42:28 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ప్రకటన కోసం.. ఎదురు చూపులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. 16 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను జగన్ ఖరారు చేసే అవకాశముంది. స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. వచ్చే నెల 29తో ఏడు పోస్టులు ఖాళీ కానున్నాయి. ఇవి ఎమ్మెల్యేకోటా కింద భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా జులై 20తో గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మొత్తం 18 ఎమ్మెల్సీ పోస్టులకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
ఒకేసారి 18 మందిని...
ఒకేసారి 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించాలని జగన్ భావిస్తున్నారు. ఇందులో ప్రముఖంగా కడప నుంచి రామసుబ్బారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని జగన్ ఇది వరకే ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలో కుడుపూడి సూర్యనారాయణ పేరు కూడా జగన్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. నిన్న పార్టీలో చేరిన జయమంగళ వెంకట రమణ పేరును కూడా జగన్ ప్రకటించనున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
సామాజికవర్గాల వారీగా...
వీటితో పాటు మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఎక్కువగా బీసీలు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సామాజికపరంగా ముఖ్యమైన వారినే జగన్ ఎంపిక చేస్తారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవుల కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారికి కూడా పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. కేవలం సామాజికవర్గం పేరు చెప్పి కష్టపడి పనిచేసిన వారిని దూరం పెడితే ఇబ్బందులు ఎదురవుతాయని కూడా కొంత అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి జగన్ ఇంత పెద్ద స్థాయిలో భర్తీ అవుతున్న పదవుల విషయంలో ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి, ఉత్కంఠ పార్టీలో నెలకొంది.
Next Story