Fri Nov 22 2024 23:08:20 GMT+0000 (Coordinated Universal Time)
చిరు సింగిల్ ఎంట్రీ... అందుకేనా?
మూవీ టిక్కెట్ల వివాదాన్ని పరిష్కరించేందుకు చిరంజీవి నడుంబిగించారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కానున్నారు.
చిరంజీవి మెగాస్టార్.. టాలీవుడ్ లో ఈతరంతోనూ ఆయన పోటీ పడుతున్నారు. చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కుగానే చిరంజీవిని అందరూ భావిస్తారు. కానీ పెద్దరికాన్ని తాను కోరుకోనంటారు. ఇండ్రస్ట్రీ సమస్యల్లో ఉన్నప్పుడు మాత్రం తాను స్పందిస్తానని చిరంజీవి చెబుతుంటారు. ఇప్పుడు మూవీ టిక్కెట్ల వివాదాన్ని పరిష్కరించేందుకు చిరంజీవి నడుంబిగించారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కానున్నారు.
పెద్దరికాన్ని ఆశిస్తూనే...
అదంతా ఒకే.. పెద్దరికం వద్దంటారు. ఎవరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయరు. చిరంజీవి సింగిల్ గానే జగన్ ను కలవడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. సమస్య పరిష్కారమయితే చాలన్న భావన అధికశాతం మందిలో ఉన్నప్పటీకి కొందరు మాత్రం చిరంజీవి ఒక్కరే వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత సమస్యలు, తన సినిమా ప్రమోషన్ కోసం సింగిల్ గా వెళితే ఎవరూ తప్పుపట్టరు. సైరా మూవీ విడుదల సమయంలో చిరంజీవి జగన్ ను కలిశారు.
చిత్ర పరిశ్రమ సమస్య పైన...
కానీ చిరంజీవి వెళుతున్నది చిత్ర పరిశ్రమ సమస్య మీద. అదీ కొద్ది రోజులుగా నలుగుతున్న మూవీ టిక్కెట్ల సమస్య మీద. దీనిపై అటు అధికార పార్టీ నుంచి ఇటు ఫిలిం ఇండ్రస్ట్రీ నుంచి మాటల యుద్ధం కూడా జరిగింది. బలుపు అనే మాట బాగా ఇద్దరి మధ్య నలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో చిరంజీవి మరికొందరిని ఇండ్రస్ట్రీ నుంచి జగన్ వద్దకు తీసుకెళితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్త మవుతుంది.
కనీసం కొందరితోనైనా....?
జగన్ కు సన్నిహితంగా ఉండే నాగార్జున, దిల్ రాజు వంటి వారిని అయినా జగన్ తో భేటీకి చిరంజీవి తీసుకెళ్లి ఉంటే కొన్ని సమస్యలపై సునిశితంగా చర్చ జరిగి ఉండేదని అంటున్నారు. అలా కాకుండా సింగిల్ గా వెళ్లి సమస్యను పరిష్కరించి తాను వద్దని చెబుతున్న పెద్దరికాన్ని చిరంజీవి ఆశిస్తున్నారా? అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. సింగిల్ గా వెళ్లి విజేతగా తిరిగి రావాలన్న చిరు ఆకాంక్ష నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story