Sun Dec 22 2024 22:31:29 GMT+0000 (Coordinated Universal Time)
నేల టిక్కెట్ రోత వద్దు... తగ్గితేనే మంచిదా?
చిత్ర పరిశ్రమ పెద్దన్న చిరంజీవి తన వద్దకు రానే వచ్చాడు. ఇక ఈ సమస్యకు జగన్ పుల్ స్టాప్ పెడితేనే మంచిది.
సినిమా టిక్కెట్ల వివాదానికి జగన్ కు ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ తగ్గితేనే మంచిదన్న సూచనలు విన్పిస్తున్నాయి. తెగేదాకా లాగకూడన్న సామెత అక్షరాలా మూవీ టిక్కెట్ల విషయంలో జగన్ కు వర్తిస్తుంది. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను పేద ప్రజలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటారని చెబుతారు. సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు వ్యవహారం కూడా అంతేనంటారు.
సామాన్యులకు....
సామాన్యులకు సినిమా టిక్కెట్ల ధరలను అందుబాటులోకి తేవడం మంచిదే. కానీ కనీసం ఈరోజుల్లో విలువేలేని ఐదు రూపాయలకు టిక్కెట్ పెట్టడాన్ని ఎవరూ అంగీకరించడం లేదు. ఐదు రూపాయలకు కనీసం టీ కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ తాను నేరుగా కల్పించుకోకపోయినా లాగాల్సినంత వరకూ లాగారు. సినిమా పరిశ్రమపై ఎవరికీ పెద్దగా సదభిప్రాయం లేదు. ఇప్పుడు టిక్కెట్ల వివాదంలో గొంతు పెద్దది చేస్తున్న వారెవరూ ఏపీకి ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టడం లేదు.
ఏపీని పూర్తిగా....
వారంతా హైదరాబాద్ లో సెటిల్ అయి అక్కడ ప్రభుత్వానికే పన్ను చెల్లిస్తున్నారు. కనీసం ఒక్క సినిమాను ఏపీలో నిర్మించడానికి కూడా అగ్ర నిర్మాతలెవ్వరూ ఇష్టపడటం లేదు. ఏపీ మీద కంటే జగన్ మీదే వారికున్న కసి కెమెరా లో కన్పిస్తుంది. ఇటు సినిమాలు నిర్మించక, అటు పన్నులు చెల్లించక ఇండ్రస్ట్రీ విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టేవారిని ఏపీ ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరు. గత కొన్నాళ్లుగా ఇదే అంశంలో చర్చ పెట్టడంపై జగన్ వంద శాతం సక్సెస్ అయినట్లే.
సక్సెస్ అయ్యారుగా...?
ఏపీలో తమ సినిమాల వల్ల రాబడి కావాలి కాని, అదే రాష్ట్రంలో సినిమాలు తీయడానికి మాత్రం ఇష్టపడరన్న విషయం ప్రతి ఒక్కరికీ అర్ధమయింది. సినిమా టిక్కెట్ల కంటే ఇప్పుడు ఏపీలో చాలా సమస్యలున్నాయి. అందుకే దీనికి జగన్ ఫుల్ స్టాప్ పెడితేనే మంచిది. లేకుంటే నేల టిక్కెట్ వ్యవహారంగా మారుతుంది. జగన్ ను పట్టించుకోక పోవడం, తాము అందరికీ అతీతులమన్న భావన ఇండ్రస్ట్రీలో ఉన్న కొందరికి ఉండటం తప్పు. ఇటు జగన్ కూడా పరిశ్రమ నిలదొక్కుకునేందుకు ఊతమివ్వాల్సి ఉంటుంది. చిత్ర పరిశ్రమ పెద్దన్న చిరంజీవి తన వద్దకు రానే వచ్చాడు. ఇక ఈ సమస్యకు జగన్ పుల్ స్టాప్ పెడితేనే మంచిది.
Next Story