Tue Dec 24 2024 14:03:25 GMT+0000 (Coordinated Universal Time)
బికాం కాదట.. డీకాం అట.. తప్పు ఆయనది కాదు..టైపుదట
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై సీఐడీ కేసు నమోదయింది. ఆయన బికాం చదివినట్లు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై సీఐడీ కేసు నమోదయింది. ఆయన బికాం చదివినట్లు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయనపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో దాని సూచన మేరకు ఏపీ సీఐడీ పోలీసులు అశోక్ బాబు పై కేసు నమోదు చేశారు. అశోక్ బాబు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆ సమయంలో తన సర్వీస్ రికార్డుల్లో విద్యార్హతలను తప్పుడుగా పేర్కొన్నారు. దీంతో సీఐడీ పోలీసులు అశోక్ బాబుపై 477A, 465, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎసీటీవోగా....
అశోక్ బాబు గతంలో ఎపీ ఎన్జీవో అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన సమైక్యాంధ్ర ఉద్యమంలోనే హైలెట్ అయ్యారు. కొత్తగా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అశోక్ బాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయిన తర్వాత అశోక్ బాబు ఆ పార్టీ గొంతుకగా మారారు. అందువల్లనే పాత కేసులను తిరగదోడుతున్నారని అశోక్ బాబు చెబుతున్నారు.
పాత కేసుగా....
ఇది పాత కేసుగా అశోక్ బాబు కొట్టి పారేస్తున్నారు. గతంలోనే తనపై ఇలాంటి ఆరోపణలు చేశారని, అవన్నీ కొట్టి పారేశారని అశోక్ బాబు చెబుతున్నారు. టైపో గ్రాఫిక్ మిస్టేక్ వల్ల డి.కామ్ అన్న స్థానంలో బికామ్ అని పడిందని, దీన్ని సాకుగా చూపి తనపై శాఖాపరమైన విచారణ కూడా గతంలో చేశారన్నారు. అయితే దీనిపై నియమించిన విచారణ కమిటీ కూడా టెక్నికల్ మిస్టేక్ తప్పించి ఎలాంటి అనుమానాలు లేవని నివేదిక కూడా ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కుట్రతోనే....
అయితే అశోక్ బాబు ప్రస్తుత ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ పై ఆరోపణలు చేస్తున్నారు. ఆయనే తనపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కొందరు కుట్ర చేస్తున్నారని అశోక్ బాబు ఆరోపిస్తున్నారు. తనపై నమోదయిన కేసులను చట్ట పరంగానే పోరాడతానని తెలిపారు. ఇంతకీ డీకాం అన్నది బీకాం అని టైప్ మిస్టేక్ పడిందని అశోక్ బాబు ఇచ్చిన వివరణ ఏపీ సీఐడీ, న్యాయస్థానాల్లో ఎంత వరకూ నిజమవుతుందో చూడాలి.
- Tags
- ashok babu
- tdp
Next Story