Sat Nov 23 2024 01:54:11 GMT+0000 (Coordinated Universal Time)
"రంగమార్తాండ" రాజీ పడ్డారా?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మౌనంగా ఉండటమే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి
ప్రకాశ్ రాజ్ .. బీజేపీకి బద్ధ శత్రువు. మోదీ అంటేనే ఒంటికాలు మీద లేస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రకాష్ రాజ్ మోదీ తీసుకున్న అనేక నిర్ణయాలను తప్పు పడుతుంటారు. బహిరంగంగానే ఆయన బీజేపీ మీద, మోదీ రాజకీయ నిర్ణయాలపైన విమర్శలు చేస్తుంటారు. ఆయన తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించినా సొంత రాష్ట్రం కర్ణాటక. అలాంటి కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన మౌనంగా ఉండటమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బేజేపీని ఓడించాలనే వారిలో మొదటి వరసలో ఉంటారు ప్రకాష్ రాజ్.
కన్నడ ఎన్నికల వేళ....
అలాంటిది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మౌనంగా ఉండటమే అనేక సంకేతాల ప్రజల్లోకి వెళ్లడానికి కారణమవుతున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు ఏపార్టీతో సంబంధం లేదు. కాంగ్రెస్‌తోనూ, జేడీఎస్‌తోనూ అనుబంధం లేదు. కానీ కర్ణాటకలో బీజేపీని ఓడించాలంటే ఆయన ఏదో ఒక పార్టీకి మద్దతు తెలపాలి. అప్పుడే బీజేపీ ఓటమికి ఆయన పనిచేసినట్లవుతుంది. అంతే తప్ప సోషల్ మీడియాలో బీజేపీని వ్యతిరేకించడం వల్ల ప్రయోజనం లేదు. బీజేపీ విధానాలు, మోదీ నిర్ణయాలు తాను వ్యతిరేకిస్తుందో ప్రజలకు తెలియజెప్పాలి. బీజేపీయేతర పార్టీని గెలిపించడానికి కృషి చేయాలి.
ీబీజేపీని ఓడించాలంటూ...
కానీ ప్రకాష్ రాజ్ ఇంత వరకూ అలాంటి పని చేయలేదు. ప్రకాష్ రాజ్ మంచి నటుడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయనను వెండి తెరపై అభిమానించే వారు ఎందరో ఉన్నారు. వారందరికీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక కాల్ ఇస్తే తప్పేముందన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న. అలాగే బీజేపీని ఓడించాలంటే తమకు మద్దతివ్వ వచ్చు కదా? అని కొందరు కాంగ్రెస్ కన్నడ నేతలు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రకాష్ రాజ్ ఇంకా ఏ పార్టీకి కర్ణాటకలో తన మద్దతు ప్రకటించలేదు. బీజేపీకి సపోర్టు చేసిన వారి మీద మాత్రం ఆయన కామెంట్స్ చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేక ప్రకటనలు చేసినంత మాత్రాన ఆయన కల నెరవేరదు. సొంత రాష్ట్రంలో తాను వ్యతిరేకించే పార్టీకి వ్యతిరేకంగా ప్రకాష్‌రాజ్ ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నారన్నది ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న.
ఇంకా సమయం ఉన్నా...
అయితే కర్ణాటక ఎన్నికలు మే 10వ తేదీన జరుగుతాయి. ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రకాష్ రాజ్ ప్రచారం చేయకపోయినా బీజేపీకి వ్యతిరేకంగా ఒక సందేశం ఇచ్చే అవకాశముందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రకాష్ రాజ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వెంట అనేక చోట్ల పర్యటించారు. దేవెగౌడ, కుమారస్వామి భేటీలోనూ ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. అలాగయితే జేడీఎస్‌కు అయినా మద్దతివ్వవచ్చు కదా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. కానీ ఇంత వరకూ ప్రకాష్ రాజ్ మాత్రం నోరు మెదపడం లేదు. అందుకు కారణమేమై ఉంటుందని రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. మరి రంగమార్తాండ రంగంలోకి దిగుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story