పరిశోధన, శ్రమ ఈ పుస్తకంలో కనిపిస్తుంది : జస్టిస్ ఎన్వీ రమణ
సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి రచించిన బ్లద్ శాండర్స్ బుక్ ను సుప్రీంకోర్టు సీజే ఎన్వీరమణ ఆవిష్కరించారు
సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ పై రచించిన పరిశోధనాత్మక బ్లద్ శాండర్స్ బుక్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రమణ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఉడుముల కుటుంబంతో ఉన్న తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఉడుముల సుధాకర్ రెడ్డి బాబాయి జోజిరెడ్డి, తాను అమరావతిలోని ఎస్ఎస్ఎన్ కళశాలలో చదువుకున్నామని చెప్పారు. సుధాకర్ రెడ్డి తండ్రి రాయపరెడ్డి తనకు సీనియర్ అని, తన గ్రామం పొన్నవరంకు సమీపంలోని జగన్నాధపురంలో మంచి రైతు అని గుర్తు చేశారు. ఆరోజుల్లో కులాలు, మతాలు లేకుండా అరమరికలు లేకుండా అందరం గడిపేవారమని సీజే ఎన్వీ రమణ అన్నారు. ఆ ఊరూ, వాడా గుర్తుకొస్తున్నాయని, నాటి మిత్రులు గుర్తుకొస్తున్నారని, త్వరలో ఆ ఊరిలో పర్యటిస్తానని ఎన్వీ రమణ తెలిపారు. జర్నలిజం ప్రారంభం రోజుల్లో సుధాకర్ రెడ్డి తనకు పరిచయమని, ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగినందుకు జస్టిస్ ఎన్వీరమణ సంతోషం వ్యక్తం చేశారు.