Wed Jan 15 2025 07:49:44 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది కాబట్టి యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని కేసీఆర్ స్పష్టం చేశారు
దేశంలోని రైతులను కేంద్ర ప్రభుత్వం గందరగోళంలో పడేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంత ధాన్యం తీసుకుంటారో కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ చెప్పలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుదన్నారు. కేంద్రం తన సామాజిక బాధ్యతను విస్మరించిందని, అందుకు ఉదాహరణే పెట్రోలు ధరలని కేసీఆర్ అన్నారు. కేంద్రం ఒక చిల్లరకొట్టులాగా వ్యవహరించిందన్నారు. ఇంత దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని కేసీఆర్ తెలిపారు. 90 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకోవాలని కేంద్రాన్ని కోరినా ఇంతవరకూ స్పందన లేదన్నారు. దీనిపై పార్లమెంటులో తమ పార్టీ సభ్యులు ప్రతి రోజూ నిలదీస్తారని చెప్పారు. తెలంగాణలో వచ్చేదే బాయిల్డ్ రైస్ అని, దానిని కొనమంటే ఎలా అని కేసీఆర్ ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి దద్దమ్మలాగా....
కిషన రెడ్డి చేతకాని దద్దమ్మలాగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వానికి చెప్పలేదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. రైతుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందని కేసీఆర్ అన్నారు. బీజేపీది దిక్కుమాలిన పాలన అని అన్నారు. తాను సమస్యలను చెప్పాలని ఢిల్లీ వెళితే వారు స్పందించలేదన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో సర్వే చేస్తే 101 స్థానంలో భారత్ నిలిచిందన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే వెనకబడి ఉందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుకు ఇది నిదర్శనమని చెప్పారు. దేశంలో ఆకలికేకలు పెరిగాయానడానికి ఈ లెక్కలు నిదర్శనం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిందే....
ఈ దేశంలో రైతులు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు బాగుపడాలంటే ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. బీజేపీని రైతు హంతక పార్టీగా కేసీఆర్ అభివర్ణించారు. విద్యుత్తు మీద పెత్తనం తీసుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమయిందని కేసీఆర్ ఆరోపించారు. ఈ ఏడేళ్లలో ఏ వర్గానికి కేంద్ర ప్రభుత్వం మేలు చేయలేదన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడేళ్ల క్రితం తెలంగాణలో మూడెకరాల రైతు పరిస్థితి ఏంది? ఇప్పుడేంది? భూముల ధరలు ఎందుకు పెరిగాయి? నీళ్లు, విద్యుత్ అందించడం వల్లనే ఇది సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో ఎక్కడైనా ఎకరా 20 ఎకరాలుందన్నారు. రైతుల విలువ పెరిగిందన్నారు. తెలంగాణ రైతులు ఇక్కడ ఎకరం అమ్మి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో భూములు కొనుగోలు చేస్తున్నారన్నారు.
కొనుగోలు కేంద్రాలుండవు...
కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది కాబట్టి యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని కేసీఆర్ స్పష్టం చేశారు. మంత్రి వర్గ సమావేశంలో నాలుగు గంటల పాటు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. తమకు వాటిని నిల్వ చేసే సామర్థ్యం, శక్తి లేదన్నారు. రాష్ట్రం ఎట్టిపరిస్థితుల్లో యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయదని కేసీఆర్ తేల్చి చెప్పారు. రైతులు అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనా సమయంలో మొక్క జొన్నలు, జొన్నలు కొని పదివేల కోట్ల నష్ట పోయామని కేసీఆర్ తెలిపారు. వర్షాకాలం పంటను మాత్రం కొనుగోలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. గెలుపోటములు సహజమని, విర్రవీగవద్దని కేసీఆర్ బీజేపీ నేతలకు హితవు పలికారు.
Next Story