సీఎం రమేష్ కోసం వెయిటింగ్....!
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ను హైదరాబాద్ కు రావాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు కోరారు. సీఎం రమేష్ కు ఫోన్ చేసిన అధికారులు తాము కొంత సమాచారం తీసుకోవాల్సి ఉందని, హైదరాబాద్ రావాల్సిందిగా కోరారు. దీంతో సీఎం రమేష్ మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఐటీ శాఖ అధికారులు అడిగే ప్రశ్నలకు సీఎం రమేష్ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. సీఎం రమేష్ వేలిముద్రల ఆధారంగా కొన్ని లాకర్లు తెరవాల్సి ఉండటంతో ఆయనను హైదరాబాద్ కు రమ్మని ఐటీ అధికారులు కోరినట్లు తెలుస్తోంది.
మొత్తం ఏడు కంపెనీలపై......
సిఎం రమేష్ నివాసం, కార్యాలయంలో రెండవరోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న సీఎం రమేష్ బావ గోవర్ధన్ నాయుడు ఇంటిపై అర్ధరాత్రి సోదాలు చేశారు. కీలక పత్రాలు, నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకుల్లో లాకర్లు ఒపెన్ చేసిన ఐటీ అధికారులు కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అర్ధరాత్రి దాటాక రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయానికి గోవర్ధన్ నాయుడిని అధికారులు తరలించారు. కంపెనీలో ఫైనాన్స్ వ్యవహారంలో కీలకవ్యక్తిగా ఉన్న గోవర్ధన్ నాయుడును ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.. సీఎం రమేష్ సోదరుడు రాజేష్ ను విచారించారు. రిత్విక్ కంపెనీలో గోవర్ధన్ నాయుడు, రాజేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. సీఎం రమేష్, సీఎం రమేష్ బావమరిది, సీఎం రమేష్ సోదరుడు సురేష్, సీఎం రమేష్ వ్యాపార భాగస్వామి రాజేష్ ఇళ్లలోకూడా సోదాలు జరుగుతున్నాయి. రిత్విక్ ప్రాపర్టీస్ ప్రయివేటు లిమిటెడ్, రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్, రిత్విక్ హోల్డింగ్స్ ప్రయివేటు లిమిటెడ్, రిత్విక్ గ్రీన్ పవర్ లిమిటెడ్, కదిరి గ్రీన్ పవర్ ప్రయివేటు లిమిటెడ్, గ్లోబల్ ఎర్త్ మినరల్స్ ప్రయివేటు లిమిటెడ్, రిత్విక్ అగ్రికల్చర్ ఫామ్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలపై సోదాలు నిర్వహిస్తున్నారు.