Fri Jan 10 2025 09:28:29 GMT+0000 (Coordinated Universal Time)
Cold Winds : బయటకు రావడానికే భయపడుతున్న జనం.. ఇంత చలి ఏందిరా సామీ?
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఇంకా పెరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయాన్నే భక్తులు ఆలయాలకు చేరుకోవడానికి భక్తులు వణికిపోతున్నారు
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఇంకా పెరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయాన్నే భక్తులు ఆలయాలకు చేరుకోవడానికి భక్తులు వణికిపోతున్నారు. తీవ్రమైన చలిగాలులతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఢిల్లీలో కూడా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పాటు పొగమంచు ఎక్కువగా ఉండటంతో జీరో విజుబిలిటీ నమోదయింది. దీంతో 120 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. పొగమంచు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక తెలంగాణలోనూ చలిపంజా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉండటంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.
చలి తీవ్రత ఎక్కువగా...
తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్లల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్ లో 6.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే పటాన్ చెర్వులో 9.6 డిగ్రీలు, రామగుండంలో 10.6 డిగ్రీలు, మెదక్ లో11.3 డిగ్రీలు, వరంగల్ లో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. జి.మాడుగులలో ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరులో పది డిగ్రీలు, మినుములూరు, అరుకులో ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పర్యాటకులు కూడా అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ నగరంలోనూ...
ఇక హైదరాబాద్ నగరం వంటి చోట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వీధులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. ఉదయం పది గంటల వరకూ రోడ్డు మీదకు బయటకు జనం రావడం లేదు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మరొకవైపు హెచ్ఎంపీవీ వైరస్ భయంతో వృద్ధులు, చిన్నారులు బయటకు రావడానికి భయపడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు వంటి వాటితో ఆందోళనతో ఉన్నారు. అనేక మంది ఇటువంటి వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఈ వైరస్ విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, మాస్క్ లు పెట్టుకుంటూ, భౌతిక దూరం పాటించడం మంచిదని సూచిస్తున్నారు.
Next Story