Sun Dec 22 2024 22:16:19 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh: ఏపీలో ఎన్డీఏ వంద రోజుల పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారంటే?
టీడీపీ, జనసేన, బీజేపీ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. ఎన్డీఏ ఏపీలో అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. ఎన్డీఏ ఏపీలో అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది. అయితే ఈ సందర్భంగా ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఇది అతి తక్కువ సమయం. కేవలం వంద రోజుల సమయంలో మ్యాజిక్ లు చేయడానికి చంద్రబాబు ఏమీ మెజీషియన్ కాదు. హామీలు అమలు చేయలేదంటే అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. వరసగా విడతల వారీగా చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కొంత సమయం పట్టే అవకాశముంది. అప్పుడే పెదవి విరుపులు, విమర్శలు చేయడం కూడా ఎన్డీఏ ప్రభుత్వంపై చేయడం సరికాదన్న అభిప్రాయం కూడా ఎక్కువ శాతం మంది ప్రజల్లో వ్యక్తమవుతుంది.
సంక్షేమ పథకాలను...
ఈ ఏడాది జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. తర్వాత వెనువెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలిసి కంగుతిన్నా వచ్చిన మొదటి నెల వృద్ధులకు ఏడువేల రూపాయలు, తర్వాత నెల నుంచి నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. దివ్యాంగులకు ఆరువేలు ఇస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నెల ఒకటో తేదీన జీతాలు చెల్లింపు, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అదే రోజున పింఛను చెల్లించడం పక్కాగా చేస్తున్నారు. దీంతో పాటు యువత కోసం చెప్పిన విధంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీకి కూడా షెడ్యూల్ విడుదల చేశారు. ఇక పేదోడి ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు విజయవాడ వరదలు వచ్చిన సమయంలో పదకొండు రోజుల పాటు బస్సులోనే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
1995 నాటి సీఎం నంటూ...
వరదల సమయంలో అధికార యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తం చేస్తూ వారికి ఆహారం, మంచినీరు, పాలు, నిత్యావసరాలు వంటివి అందచేయడంలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. అంతేకాదు పూర్తిగా మిగిలి పోయిన ఇంటికి ఇరవై ఐదు వేలు, ఫస్ట్ ఫ్లోర్ కు పది వేలు, నీట మునిగిన ఇళ్లకు పది వేలు, మోటారు బైక్‌లకు మూడు వేలు, ఆటోలకు పది వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు భారీ సాయాన్ని ప్రకటించి పెద్దమనసును చాటు కున్నారు. గతంలో వరద బాధితులకు ఏ ప్రభుత్వమూ ఇంతటి స్థాయిలో సాయాన్ని ప్రకటించలేదు. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను కూడా రద్దు చేశారు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో కొంత నెమ్మదించినా అభివృద్ధి విషయంలో మాత్రం ఆయన స్పీడ్ 1995 తరహాలో ఉందన్న ప్రశంసలు అందుకున్నారు.
తన అనుభవంతో...
మూడుసార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి పెద్దయెత్తున నిధులు తేవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను తేవడంలో విజయవంతమయ్యారు. తన హస్తిన పర్యటనలను చంద్రబాబు చక్కగా వినియోగించుకున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను నిధుల మంజూరుకు ఒప్పించి ఏపీ ప్రజలను మెప్పించగలిగారు. అయితే విమర్శలు చేసే వారికి మాత్రం కొదవలేదు. కానీ వారిని పెద్దగా పట్టించుకోకుండా ఒకవైపు మంత్రులను, మరొకవైపు అధికారులను సమన్వయం చేసుకుంటూ ఆయన పాలన కొనసాగించారు. తన అనుభవాన్ని అంతా రంగరించి మరీ చంద్రబాబు నాయుడు ఏపీని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించేందుకు శ్రమిస్తున్నారు. ఆయనకు అందరూ తోడ్పడితే త్వరలోనే ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Next Story