Thu Dec 19 2024 22:42:23 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీలో ఇక్కడ ఎందుకింత కలకలం..?
ఉమ్మడి కృష్ణాజిల్లాల్లో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. టిక్కెట్ల కోసం ఇప్పటి నుంచే వర్గాలు మొదలయ్యాయి
ఉమ్మడి కృష్ణాజిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు అచ్చంగా.. టీడీపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటాయి. అప్పు డప్పుడు.. మార్పులు జరిగినా.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ కానీ.. నాయకులు కానీ, చాలా బలంగా ఉంటున్నారు. అయితే.. ఇటీవల కాలంలో ఈ తరహా పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు పరిశీల కులు. ఎక్కడికక్కడ నాయకులు.. ఆధిపత్య బాటలో నడుస్తున్నారు. టికెట్ల కోసం.. పోటీ పడుతున్నారు. అధినేత ప్రకటించే వరకు కూడా ఆగకుండా.. తమ అనుచరులతో తమకే టిక్కెట్లు ఇస్తారనే ప్రచారం చేసుకుంటున్నారు.
ముగ్గురి మధ్య...
తిరువూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, మాజీ మంత్రి జవహర్, కొత్తగా నియమితులైన నియోజకవర్గ ఇన్చార్జి సేవల దేవదత్తు మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. కొత్త ఇన్చార్జికి నాయకులతో సఖ్యతలేదని, రాజకీయ అనుభవం శూన్యమని పార్టీలోని ముఖ్యనేతలు వ్యతిరేకిస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో నెట్టెం రఘురాం, శ్రీరాం తాతయ్య, టీడీ జనార్దన్ వర్గాల మధ్య సఖ్యత లేదు. దీంతో అక్కడ టీడీపీకి సంబంధించిన ముఖ్య సామాజిక వర్గం వారికే టికెట్టు ఇచ్చేలా పెద్దలు పావులు కదపడంతో గందరగోళం నెలకొంది.
బుద్దా వర్గాన్ని...
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు నెలకొంది. లోకేష్ పేరుతో బుద్దా వెంకన్న పెత్తనం చేయాలని చూస్తున్నారనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. పశ్చిమ నియోజకవర్గంలో తాను చెప్పిన వ్యక్తికే టికెట్ ఇస్తానంటేనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని చంద్రబాబుకు ఎంపీ కేశినేని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. బుద్దా వెంకన్నను దూరంగా ఉంచాలని షరతు పెట్టారట. కానీ లోకేష్ ససేమిరా అనడంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక పోతున్నారని అంటున్నారు. దీంతో అలిగిన కేశినేని నాని మహానాడుకు కూడా హాజరు కాలేదు. బీజేపీ పెద్దలతో టచ్లో ఉంటున్న ఆయన ఎన్నికలకు ముందు టీడీపీకి ఝులక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారన్న చర్చ కార్యకర్తల్లో ఉంది. తనకు పార్టీ నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పకపోవడంతో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అలకబూని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
గద్దెను ఎంపీగా...
ఇక విజయ వాడ సెంట్రల్, మైలవరం నియోజక వర్గాల్లోనూ అంతకు మించిన వివాదాలే ఉన్నాయని చెబుతున్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు పరిస్థితి పైకి కనిపిస్తున్నంత బలంగా లేదని అంటు న్నారు. గద్దె సీటుపై పలువురు టీడీపీ నేతలు కన్నేశారు. లోకేష్ అండదండలతో కొందరు ఎన్ఆర్ఐలు ఈ నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండటంపై గద్దె కుటుంబం గుర్రుగా ఉంది. అవసరమైతే గద్దెను ఎంపీ అభ్యర్థిగా పంపించి, ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఓ ఎన్ఆర్ఐకి అధిష్టానం మాట ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో గద్దె తీవ్ర మనస్తాపం చెంది, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పెద్ద టాక్ నడుస్తుండడం గమనార్హం.
Next Story