Sat Jan 11 2025 10:35:08 GMT+0000 (Coordinated Universal Time)
రాజు గారి ఆయాసం.. అంతవరకేనా?
రఘురామ కృష్ణరాజు కు చెందిన కంపెనీలు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలకు పైగానే బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేశాయి
ఒకరి వైపు చేయి చూపేటప్పుడు మరో నాలుగు వేళ్లు మనవైపు చూస్తాయి. ఇది అందరికీ తెలిసిన నీతి. కానీ రాజకీయ నాయకులు మాత్రం గురివింద సామెతలా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తెగ ఆయాస పడిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని, ఎఫ్ఆర్ఎంబీ పరిధికి మించి చేసి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తుందని రాజుగారు గగ్గోలు పెడుతున్నారు. పార్లమెంటు సమావేశాల్లోనే ప్రస్తావించడం కాదు.
రాజుగారి ఆందోళన...
ప్రధాని మోదీకి లేఖలు రాస్తున్నారు. అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల పాలవుతుంటే తన మనసు ఆందోళనకు గురవుతుందని ఆయన పదే పదే మీడియాకు చెబుతున్నారు. రాష్ట్రం చేసే నిర్వాకం వల్ల భవిష్యత్ లో ప్రజలే కాదు, బ్యాంకుల పుట్టి కూడా మునిగి పోతుందని రాజుగారు రోదిస్తున్నారు. కానీ తాను మాత్రం అవే బ్యాంకులకు వందల కోట్లు ఎగవేసిన విషయాన్ని మాత్రం రఘురామ కృష్ణరాజు మర్చిపోతున్నారు.
వందల కోట్లకు పైగానే...
రఘురామ కృష్ణరాజు కు చెందిన కంపెనీలు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలకు పైగానే బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేశాయి. బ్యాంకులు నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. తమ కంపెనీలు నష్టం చూపి బ్యాంకులను ఎగ్గొట్టే ప్రయత్నం ఆ కంపెనీలు చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే సీబీఐ, ఈడీ వంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఒక్క రఘురామ కృష్ణరాజు మాత్రమే కాదు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వంటి వారు కూడా ఇదే కోవలో ఉన్నారు.
తన వద్దకు వచ్చేసరికి...
కానీ వారు బ్యాంకులకు రుణాలను ఎగ్గొడ్డటం సమర్థించుకుంటున్నారు. తాను బ్యాంకులకు రుణాన్ని ఎగవేయలేదని, కంపెనీకి నష్టాలు రావడంతోనే చెల్లింపులు చేయలేకపోతున్నామని రఘురామ కృష్ణరాజు చిలకపలుకులు పలుకుతున్నారు. మరి అదే సమయంలో ఏపీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోకూడదట. ఏపీ సర్కార్ కు అప్పులు ఇవ్వకుండా మోదీ నియంత్రించాలట. రాజు గారి ప్రయత్నం అదే. మరి రఘురామ కృష్ణరాజు తొలుత ఆయన తాను చెల్లించాల్సిన అప్పులు కట్టి ఇతరులకు నీతులు చెబితే బాగుంటుంది.
Next Story