Sat Dec 28 2024 21:38:17 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ కు భలే గిఫ్ట్ ఇచ్చారే?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిటిన ఏ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఇంతవరకూ గెలవలేదు. మునుగోడులోనూ డిపాజిట్ కోల్పోయింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిటిన ఏ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఇంతవరకూ గెలవలేదు. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా, సీనియర్ నేతలున్న రాష్ట్రంగా ఆ పార్టీకి ఒనగూరిన ప్రయోజనం లేదు. 2014, 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పరాభవమే దక్కింది. దీనికితోడు ఏ ఉప ఎన్నికలోనూ గెలవలేదు. కాంగ్రెస్ నేతల చేతకాని తనమా? లేదా ప్రజల్లో క్రమంగా ఆ పార్టీ విశ్వాసం కోల్పోతుందనడానికి ఇది సంకేతమా? అన్నది ఆ పార్టీ నేతలే తేల్చుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే సాధారణ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. ఆ ఎన్నికల్లోనూ ఓటమి పాలయితే తెలంగాణలో కాంగ్రెస్ ఇక కోలుకోవడం కష్టమేనన్నది వాస్తవం.
ఐక్యత ఏదీ?
ఉప ఎన్నికల్లో కనీసం బీజేపీ నేతలు చూపించి ఐక్యతను కూడా కాంగ్రెస్ నేతలు చూపించలేక పోతున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలనే వరసగా కోల్పోతుండటం కూడా ఆ పార్టీకి ఎదురుదెబ్బే. మునుగోడు ఉప ఎన్నికలు జరిగే సమయానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోనే ఉంది. ఇప్పటికీ తెలంగాణలోనే యాత్ర కొనసాగుతుంది. తమ అధినేతకు తెలంగాణలోనే అపూర్వ విజయాన్ని అందివ్వాలన్న ఆలోచన ఆ పార్టీలో ఏ నేతకూ లేదనే చెప్పాలి. ఆయన కంట్లో పడేందుకే ప్రయత్నిస్తారు తప్పించి మునుగోడుకు వెళ్లి నాలుగు ఓట్లు సంపాదిద్దామన్న ధాస్య లేదు.
మునుగోడులో ఓడితే...
రేవంత్ రెడ్డి అంటే పడదు సరే. రేవంత్ రెడ్డితో పడకపోతే ఆయనపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాని మునుగోడులో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే రేవంత్ పదవి ఊడిపోతుందన్న ఏకైక లక్ష్యం తప్ప పార్టీని గెలిపించుకోవాలన్న సోయ లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నేతలే నాశనం చేసుకుంటున్నారు. నేతలే పనిచేయకపోతే ఇక ప్రజలు ఆ పార్టీని ఎందుకు నమ్మాలి? అన్న కనీసం లాజిక్ ను కూడా కాంగ్రెస్ సీనియర్లు పట్టించుకోరు. ఏదో సభ పెట్టామా? మాట్లాడామా? అనే ధ్యాస తప్ప ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలను రచించడంలో కాంగ్రెస్ పెద్దలు అట్టర్ ఫ్లాప్ అయ్యారు.
జనం నమ్మేదెలా?
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల పై నమ్మకం పూర్తిగా పోయింది. ఆ పార్టీకి ఓటేసినా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరతారన్న కామన్ పాయింట్ జనం మెదళ్లలోకి బాగా వెళ్లింది. అందుకే ఆ పార్టీకి ఓటేసి లాభం ఏంటి? అని ప్రజలు ప్రశ్నించుకుంటే ఇక ఓట్లు ఎలా వస్తాయి? అన్న ప్రశ్నలు కాంగ్రెస్ నేతలు వేసుకుంటే మంచిది. రాహుల్ గాంధీ తెలంగాణలో యాత్ర కొనసాగిస్తుండగా ఆ పార్టీకి డిపాజిట్లు కూడా పోవడంపై సీనియర్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మునుగోడు ఓటమిలో తన బాధ్యత ఎంతో బేరీజు వేసుకోవాలి. అంతేకాదు కనీసం పశ్చాత్తాపం పడితే ఇప్పటికైనా మంచిది. లేకుంటే కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికలలో జనం నమ్మరు. నమ్మరు గాక నమ్మరు. అది అంతే.
Next Story