Sun Jan 12 2025 05:44:42 GMT+0000 (Coordinated Universal Time)
Karnataka results : కన్నడ నాట కాంగ్రెస్ సునామీ
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం దిశగా పయనిస్తుంది. దాదాపు 124 అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో ఉంది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం దిశగా పయనిస్తుంది. దాదాపు 124 అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఒంటిరిగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పార్టీ హైకమాండ్ కర్ణాటకలోనే మకాం వేసి అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కావడంతో ఆయన అక్కడే ఉండి నేతలతో సమావేశమై పరిస్థితిపై చర్చిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటమి స్పష్టంగా కర్ణాటక ఎన్నికల్లో కనిపించింది. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనూ అభ్యర్థులు ఆధిక్యంలోకి రావడంతో ఆపార్టీ నేతల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ఏ ప్రాంతంలోనైనా...
ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, పాత మైసూరు ప్రాంతంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మంత్రుల దగ్గర నుంచి ధనవంతుల వరకూ ఒక్కరనేది లేదు.. కాంగ్రెస్ గాలిలో కొట్టుకుపోతున్నారు. కాంగ్రెస్ కర్ణాటకలో రాజకీయ సునామీ సృష్టించిందనే చెప్పాలి. పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలవగా, జేడీఎస్ రెండోస్థానంలోనూ, బీజేపీ మూడో స్థానంలోనూ నిలిచిందని చెప్పాలి. పాత హైదరాబాద్ ప్రాంతంలోనూ బీఆర్ఎస్ ప్రభావం పనిచేయలేదు. అక్కడ కూడా ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకున్నారు.
జోడో యాత్రతో...
ఇక దీంతో పాటు రాహుల్ గాంధీ కర్ణాటకలో జరిపిన భారత్ జోడో యాత్ర ఈ ఫలితాలను తెచ్చిపెట్టిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కన్నడనాట రాహుల్ ఎక్కువ రోజులు పాదయాత్ర చేశారు. 25 రోజుల పాటు 500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇక్కడ సోనియా, ప్రియాంకలు కూడా కలసి రాహుల్‌తో కలసి నడవడం కలసి వచ్చింది. జోడో యాత్రలో ఉన్నప్పుడే రాహుల్ నేతలందరినీ ఏకం చేశారు. అందరినీ ఒక తాటి మీదకు తెచ్చారు. అందరూ కలిసి ఉంటేనే తాను ఎక్కువ రోజులు కర్ణాటకలో పాదయాత్ర చేస్తానని నేతలకు షరతులు పెట్టి మరీ వారిని ఏకం చేశారు. ఆ కారణంగానే రాహుల్ పాదయాత్ర సుదీర్ఘ కాలం సాగిందని, జనం కూడా రాహుల్ ను చూసేందుకు తరలి రావడంతో అప్పుడే కాంగ్రెస్ గెలుస్తుందని అంచనాలు వినిపించాయంటున్నారు.
అభ్యర్థుల ఎంపికలో...
ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కూడా కాంగ్రెస్ ఈసారి ఆచితూచి వ్యవహరించింది. పాత నేతలందరూ పార్టీని వదిలి పెట్టడంతో కొత్త అభ్యర్థులను రంగంలోకి దించారు. సర్వేలు చేయించి సరైన అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు బీజేపీ అధికారంలో ఉండి అసంతృప్తి మూట గట్టుకోవడం, సామాజికవర్గాల్లో బలహీన పడటంతో పాటు డీకే శివకుమార్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండటంతో ఒక్కలిగలు, సిద్ధరామయ్య కీలక నేతగా ఉండటంతో బీసీలు, ఖర్గే ఏఐసీసీ అధినేత గా ఉండటంతో దళితులు అందరూ అండగా నిలిచారు. దీంతోనే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకు పోతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story