Thu Dec 19 2024 18:59:44 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డి రాజీనామా చేయరట.. షా చెప్పింది ఇదే
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. మండలాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడతారన్న ప్రచారం గత కొంత కాలంగా సాగుతుంది. ఆయన మాటలు కూడా ధృవీకరించేలానే ఉన్నాయి. బీజేపీని ప్రశంసించడం, కాంగ్రెస్ ను తూలనాడుతుండటంతో కోమటిరెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరతారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది.
మండలాల వారీగా...
ఈరోజు నుంచి కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే ఆయన పార్టీ మారడం దాదాపు ఖాయమయింది. వచ్చే ఏడాదిలోనే తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినా ప్రయోజనం లేదని పలువురు సూచిస్తున్నారు. రెండు, మూడు నెలలు దాటిన తర్వాత రాజీనామా చేస్తే సాధారణ ఎన్నికలతో పాటు బరిలోకి దిగివచ్చన్న భావనలో ఉన్నట్లుంది.
అమిత్ షాను కలిసి....
ఉప ఎన్నికల విషయం, రాజీనామా అంశంపైనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది. అయితే రాజీనామా చేయవద్దని, సాధారణ ఎన్నికలకు ముందు రాజీనామా చేసి పార్టీలో చేరితే కొంత మైలేజీ బీజేపీకి వస్తుందని అమిత్ షా చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు రాజీనామా చేసినంత మాత్రాన కాంగ్రెస్ కు నష్టమే తప్ప, టీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం చేకూరదని అంటున్నారు. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో భేటీల పేరుతో రాజీనామా అంశాన్ని నానుస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story