Sat Nov 23 2024 01:32:14 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డి మళ్లీ కష్టాల్లోకి నెట్టేశారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ పర్యటనలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నమ్మకమైన నేతలే పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. పార్టీకి కొంత హైప్ వస్తుందనుకుంటున్న సమయంలో వెనక్కు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు శత్రువులు కాంగ్రెస్ నేతలే. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన ప్రశసంలు పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. ఇప్పడిప్పుడే కోలుకుంటున్న పార్టీని, వీధుల్లోకి వస్తున్న క్యాడర్ ను నిరాశపర్చే విధంగా ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడూ కేసీఆర్ పై విరుచుకుపడతారు. విమర్శలు చేస్తారు. అలాంటి కోమటిరెడ్డి కేసీఆర్ ను కొనియాడి కాంగ్రెస్ ను కష్టాల్లోకి నెట్టారు.
జనగామ పర్యటనలో...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ పర్యటనలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఆయన ముఖ్యమంత్రి బస్సులోనే కలసి రావడం విశేషం. భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేసీఆర్ వెంట కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. జనగామలో దాదాపు 34 కోట్ల రూపాయలతో నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవన సముదాయ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్ వెంట కోమటిరెడ్డి...
ఈరోజు జనగామలో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట పార్లమెంటు సభ్యుడి హోదాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలోనూ కేసీఆర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనను పక్కనే ఉంచుకుని జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించడం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. కేసీఆర్ ఆయన చేత స్వయంగా కొబ్బరి కాయ కొట్టించారు.
కేసీఆర్ పై ప్రశంసలు...
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా, తెలంగాణ ప్రభుత్వంపైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసలు కురిపించడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. 33 జిల్లాలను చేసినందుకు కేసీఆర్ కు కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కష్ట సమయంలోనూ ఆదాయం లేకున్నా పథకాలను కొనసాగిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ కలెక్టరేట్ ల మాదిరిగా ఇతర రాష్ట్రాల సెక్రటేరియట్ లు కూడా లేవని అన్నారు. ఒకవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
అసంతృప్త నేతగా....
తొలి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగానే ఉన్నారు. తనకు పీసీసీ చీఫ్ పదవి దక్కలేదన్న అక్కసుతో ఉన్నారు. పార్టీ నిర్ణయాన్ని థిక్కరించి వైఎస్ సంస్మరణ కార్యక్రమానికి వెళ్లి అక్కడ పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడారు. మరోసారి ఇలా అధికార పార్టీని, ముఖ్యమంత్రిని ప్రశంసించడంపై పార్టీ హైకమాండ్ కు ఇప్పటికే కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోలుకోలేని కాంగ్రెస్ నుంచి దూరమవుదామనుకుంటున్నారా? అన్న చర్చ జరుగుతోంది.
Next Story