Mon Dec 23 2024 06:27:10 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల పార్టీ పై సర్వే నివేదిక చెప్పిందిదేనా?
వైఎస్ షర్మిలను తేలిగ్గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు భయం పట్టుకుంది. ఇందుకు సర్వే నివేదికలే కారణం.
అవును.. నిన్న మొన్నటి వరకూ వైఎస్ షర్మిలను తేలిగ్గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు భయం పట్టుకుంది. ఇందుకు సర్వే నివేదికలే కారణం. పార్టీ వ్యూహకర్తగా ఉన్న సునీల్ టీం ఇచ్చిన నివేదిక తెలంగాణ కాంగ్రెస్ నేతలకు బెంగ పట్టుకుంది. వైఎస్ షర్మిల పార్టీ ప్రభావంతో కాంగ్రెస్ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సునీల్ టీం నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ జాగ్రత్త పడకపోతే షర్మిల ప్రభావంతో కాంగ్రెస్ దెబ్బతింటుందని నివేదికలో పేర్కొన్నారు.
పాదయాత్రతో...
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడమే కాకుండా పాదయాత్రను కూడా ప్రారంభించారు. వైఎస్సార్టీపీ చీఫ్ గా ఆమె ఇప్పటికే 1500 పాదయాత్ర చేపట్టారు. జిల్లాల్లో ఆమెకు జనం నుంచి కూడా స్పందన కన్పిస్తుంది. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పాదయాత్రకు రెస్సాన్స్ ఎక్కువగా కన్పించింది. షర్మిల పాదయాత్ర తో పాటు ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా దీక్షలకు కూడా దిగుతున్నారు.
అందుకే భయం...
అంతేకాకుండా వైఎస్ షర్మిల తాను పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. షర్మిల పాలేరులో పోటీ చేస్తే ఆ ప్రభావం ఖమ్మంతో పాటు నల్లగొండ జిల్లాలపై ఉంటుందన్న నివేదికలు కాంగ్రెస్ నేతలు వణికిస్తున్నాయి. సర్వే ద్వారా అందిన నివేదికలు కావడంతో కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. షర్మిల పార్టీ అభ్యర్థులు గెలవకున్నా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తారన్నది ఎక్కువమంది అభిప్రాయం.
సర్వే నివేదిక ద్వారా...
తెలంగాణలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిలకు అండగా నిలుస్తారని కూడా సర్వే నివేదికలో చెప్పినట్లు తెలిసింది. రెడ్డి సామాజికవర్గమే కాకుండా ఎస్సీ, ఎస్టీలు కూడా షర్మిలకు మద్దతు తెలిపే అవకాశం ఉందని చెప్పడంతో కాంగ్రెస్ అగ్రనేతలు అలర్ట్ అయ్యారు. ఈరోజు సమావేశమై షర్మిల పార్టీ ప్రభావంపై చర్చించనున్నారు. వైఎస్ ను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా చేశారు. హైదరాబాద్ లో వైఎస్ మెమోరియల్ కూడా లేదన్నారు. కాంగ్రెస్ నేతలు వైఎస్ షర్మిల పార్టీ ప్రభావంపై పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
Next Story