Wed Jan 01 2025 10:28:21 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ ను చావు దెబ్బ తీసింది అదే
గుజరాత్ లో కాంగ్రెస్ దారుణమైన ఫలితాలను చూడాల్సి వస్తుంది. ఇంత దారుణ ఓటమిని ఆ పార్టీ కూడా ఊహించి ఉండదు.
గుజరాత్ లో కాంగ్రెస్ దారుణమైన ఫలితాలను చూడాల్సి వస్తుంది. ఇంత దారుణ ఓటమిని ఆ పార్టీ కూడా ఊహించి ఉండదు. కేవలం 20 స్థానాల్లోనే కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండం విశేషం. కాంగ్రెస్ చావుదెబ్బ తినడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. గత 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లను సాధించింది. 47 ఓట్ల శాతాన్ని దక్కించుకుంది. ఈసారి మాత్రం కాంగ్రెస్ కు 30 శాతానికి మించి ఓట్లు పడే అవకాశాలు కనిపించడం లేదు.
ప్రచారంలోనూ...
గుజరాత్ లో బీజేపీకి తిరుగులేని ఆధిక్యత వస్తుందని తొలి నుంచి ఊహించిందే. ఆ పార్టీ ఒక పద్ధతి ప్రకారం ఎలక్షనీరింగ్ చేసింది. కాంగ్రెస్ గుజరాత్ ఎన్నికలను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదనే చెప్పాలి. అగ్రనేతలు ఎవరూ ఆ పార్టీ తరుపున ప్రచారం చేసింది కూడా లేదు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ కాంగ్రెస్ అన్నింటా వెనకబడే ఉంది. ఒకరకమైన నిరాసక్తత, నిస్సహాయత కాంగ్రెస్ కార్యకర్తల్లో కనిపిస్తుంది.
సీరియస్ గా తీసుకుంది ఏదీ?
రాహుల్ గాంధీ 2017 ఎన్నికలను సీరియస్ గా తీసుకుని అక్కడే మకాం వేసి కొంత దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అందుకే అప్పుడు 77 స్థానాలను సాధించి బీజేపీకి మంచి పోటీ ఇచ్చినట్లయింది. కానీ ఈసారి మాత్రం భారత్ జోడో యాత్రలో ఉండటం, అభ్యర్థుల ఎంపికపై కూడా పెద్దగా శ్రద్ధపెట్టకపోవడం వంటి కారణాలు కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీశాయన్నది విశ్లేషకుల అంచానా. హార్థిక్ పటేల్ వంటి నేతలు కూడా పార్టీని వీడి వెళ్లిపోవడం కాంగ్రెస్ ను మరింత దెబ్బతీసింది.
ఓట్లు చీల్చుకోవడంతో...
దీంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం పార్టీలు ఓట్లను చీల్చుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉండటంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కొద్దో గొప్పో ఉంటుందని అంచనా వేశాయి. అయితే ఉన్న కొద్దిపాటి వ్యతిరేకతను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎంలు చీల్చుకోవడంతో కాంగ్రెస్ చతికల పడింది. గుజరాత్ అంటే కమలం పార్టీ కంచుకోట అన్న భావన ప్రజల్లోనూ నెలకొనడంతో ఆటోమేటిక్ గా అక్కడ ప్రజలు హస్తం గుర్తును మర్చిపోయారనే చెప్పాలి. మొత్తం మీద గుజరాత్ లో కాంగ్రెస్ చావుదెబ్బ తినడానికి కర్ణుడి చావుకు.. అన్నట్లు అనేక కారణాలున్నాయని చెప్పకతప్పదు.
Next Story