Fri Nov 22 2024 19:41:16 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మ నాన్న... ఇద్దరు కొడుకులు
సీనియర్ కాంగ్రెస్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇంట్లో ఇలాంటి వివాదమే చోటు చేసుకుంది
రాజకీయాలు అంతే. కుటుంబాల్లోనూ చిచ్చు పెడుతాయి. చేరికలు ధర్మపురి శ్రీనివాస్ ఇంట్లో చిచ్చు రేపాయనే చెప్పాలి. సీనియర్ కాంగ్రెస్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇంట్లో ఇలాంటి వివాదమే చోటు చేసుకుంది. ధర్మపురి శ్రీనివాస్ పెద్దకుమారుడు, మాజీ మేయర్ సంజయ్‌కు మద్దతుగా నిలిచారు. ఆయనను నేరుగా కాంగ్రెస్‌లో చేర్చకుండా తానే వీల్ ఛెయిర్లో వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువాను ధర్మపురి శ్రీనివాస్ కప్పుకున్నారు. సంజయ్ రాజకీయ భవిష్యత్ కోసమే డిఎస్ గాంధీభవన్ కు వచ్చి మరీ పార్టీలో చేరారు. ఆరోగ్యం సహకరించకపోయినా తాను ఓపిక చేసుకుని మరీ తండ్రిగా ఒక కొడుకు కోసం గాంధీభవన్ గడప తొక్కారు.
పెద్దకొడుకు కోసం...
ఇటీవల ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యం పాలయ్యారు. ఆయన మాట కూడా సరిగా మాట్లాడలేకపోతున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలతో సంప్రదించి తొలుత సంజయ్‌ను పార్టీలో చేర్చాలనుకున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన కూడా జారీ చేశారు. అయితే కొద్దిసేపటికే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. సంజయ్ తో పాటు నిన్న గాంధీభవన్ కు వచ్చిన ధర్మపురి శ్రీనివాస్ తన సొంత ఇంటికి వచ్చానని తెలిపారు. నిజామాబాద్ జిల్లాకాంగ్రెస్ నేతలకు కూడా చివరి నిమిషంలో డీఎస్ చేరిక సమాచారాన్ని అందించారు.
రాజీనామా చేస్తూ...
అయితే ఈరోజు ధర్మపురి శ్రీనివాస్ భార్య ఒక వీడియోను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీకి ధర్మపురి శ్రీనివాస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీడియోలో డీఎస్ రాజీనామా లేఖ రాస్తున్నది కూడా కనపడుతుంది. అయితే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, పక్షవాతం కూడా వచ్చిందని తమ ఇంటి వైపు కాంగ్రెస్ నేతలు ఎవరూ రావద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీనేతలు పెట్టిన వత్తిడికి ఫిట్స్ కూడా వచ్చాయని ఆయన ఆరోపించారు. డీఎస్ రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు.
తండ్రికి పెద్దకొడుకు... చిన్న కొడుకు వైపు తల్లి...
అయితే ధర్మపురి శ్రీనివాస్ రాజీనామా లేఖ, తల్లి వీడియోను నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ చేయించిందేనంటూ సంజయ్ విమర్శించారు. అరవింద్ తమ అమ్మానాన్నలపై వత్తిడి తెస్తున్నారన్నారు. అవకాశమిస్తే తాను అరవింద్‌పై పోటీ చేేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. అరవింద్ తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్‌ను బ్లాక్ మెయిల్ కు గురి చేస్తున్నారని సంజయ్ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ధర్మపురి శ్రీనివాస్ కుటుంబంలో చేరికల చిచ్చు వీధిన పడిందనే చెప్పాలి. పెద్ద కొడుకు కోసం తండ్రి ధర్మపురి శ్రీనివాస్, చిన్న కొడుకు కోసం తల్లి ఇద్దరూ ప్రయత్నిస్తుండటమే ఈ విభేదాలకు కారణం.
Next Story